Begin typing your search above and press return to search.

ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!

బాలీవుడ్‌లో పనిగంటల వివాదం కొనసాగుతున్న వేళ.. అక్షయ్ కుమార్ తన షూటింగ్ షెడ్యూల్‌పై స్పందించారు. రోజుకు 8 గంటలు పనిచేసినా, ఆ సమయంలో కెమెరా ముందే ఉంటానని తెలిపారు. 8 గంటల పని, 8 గంటల నిద్ర, ఫిట్‌నెస్, కుటుంబానికి సమయం కేటాయించేలా దినచర్య రూపొందించుకున్నానన్నారు. వేగంగా షూటింగ్ పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఖర్చు తగ్గుతుందని రవికిషన్ ప్రశంసించారు.

By:  Srikanth Kontham   |   26 Nov 2026 2:29 PM IST
ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!
X

బాలీవుడ్ లో ప‌నిగంట‌ల వివాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. దీపికా ప‌దుకోణే లేవ‌నెత్తిన అంశం స‌ర్వాత్ర చ‌ర్చ‌కొచ్చింది. చాలా మంది సెల‌బ్రిటీల‌కు దీపిక‌కు మ‌ద్దతుగా నిలిచారు. తాజాగా అక్ష‌య్ కుమార్ అనుభ‌వాన్ని కూడా చెప్ప‌క‌నే చెప్పారు. తనను కొందరు పెద్ద నిర్మాతలు.. దర్శకులు సినిమాల్లోకి తీసుకోవడానికి వెనుకాడు తున్నారని అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టాక్ షో వేదిక‌గా అక్షయ్ తన షూటింగ్ షెడ్యూల్‌పై వస్తున్న పుకార్లు.. పని వేళల వెనుక ఉన్న ఆంతర్యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు.

తాను కేవలం ఎనిమిది గంటలే పని చేస్తానని చాలామంది ప్రచారం చేస్తారని.. కానీ ఆ సమయంలో వ్యానిటీ వ్యాన్‌లోకి కూడా వెళ్లకుండా కెమెరా ముందే ఉంటానన్నారు. అలసిపోయిన మొహంతో కాకుండా ఉత్సాహంగా, తాజాగా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారని అందుకే ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, రెండు గంటల ఫిట్‌నెస్, మరికొన్ని గంటలు కుటుంబానికి కేటాయించేలా దినచర్యను రూపొందించుకున్నానని తెలిపారు.

షూటింగ్‌లను వేగంగా పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుందని రవికిషన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. సాధారణంగా 55 రోజుల్లోనే అక్షయ్ ఓ సినిమాను పూర్తి చేస్తారని.. దానివల్ల నిర్మాతలకు లాభం చేకూరడంతో పాటు యూనిట్‌లో మూడు నాలుగు వందల మందికి నిరంతరం ఉపాధి లభిస్తుందని రవికిషన్ పేర్కొన్నారు.

తక్కువ రోజుల్లో సినిమా ఎలా పూర్తి చేస్తారని కొందరు ఆశ్చర్యపోతుంటారని.. కానీ హాలీవుడ్‌లోనూ ఇదే వేగం కనిపిస్తుందని అక్షయ్ గుర్తు చేశారు. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓ సినిమాను 90 రోజుల్లోపే పూర్తి చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చదివానని.. అలాగే టామ్ క్రూజ్ `మిషన్ ఇంపాజిబుల్ ` ను కేవలం 55 రోజుల్లో చుట్టేశారని ఉదాహరణగా చూపించారు.

ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `గోల్‌మాల్ 5`లో నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, కునాల్ ఖేము, శర్మన్ జోషి, శ్రేయస్ తల్పడే, తుషార్ కపూర్ వంటి భారీ తారాగణంతో తెర‌కెక్కుతోన్న‌ కామెడీ చిత్రం 2027 జనవరి లో విడుదల కానుంది.