Begin typing your search above and press return to search.

కేవలం 55రోజుల్లోలో ముగించేసే పెద్ద హీరో.. వింటున్నారా టాలీవుడ్ టాప్‌ హీరోలు?

అక్షయ్ కుమార్ తన సినిమాల షూటింగ్‌ను 55 నుంచి 65 రోజుల్లో పూర్తి చేస్తానని తెలిపారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తూ, ముందస్తు ప్రణాళికతో షూటింగ్‌ ముగిస్తానని చెప్పారు. దీనివల్ల నిర్మాతలకు ఖర్చులు తగ్గడంతో పాటు వందల మందికి ఉపాధి లభిస్తుందని రవికిషన్ ప్రశంసించారు. అక్షయ్ పని విధానం ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల సమయపాలనపై చర్చకు దారితీసింది.

By:  Sivaji Kontham   |   27 Nov 2026 7:00 PM IST
కేవలం 55రోజుల్లోలో ముగించేసే పెద్ద హీరో.. వింటున్నారా టాలీవుడ్ టాప్‌ హీరోలు?
X

కేవలం 55 రోజుల్లోనే ఒక భారీ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేయ‌డం అంటే ఆషామాషీనా? దానికోసం చాలా నిబ‌ద్ధ‌త, క‌ట్టుబాట్లు, క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌రం. స్టార్ త‌లుచుకుంటే కానిది ఏమీ లేదు. కానీ నిర్మాత‌లు ఆవేద‌నను ఎవ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితి.. ప‌రిమిత ప‌నిదినాల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేసే స్టార్ హీరో నేనేనని బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించ‌డంతో అది కాస్తా సినీప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ‌గా మారింది. హాలీవుడ్ దిగ్గజాలు క్రిస్టోఫర్ నోలన్, టామ్ క్రూజ్‌ల తరహాలో అత్యంత వేగంగా పక్కా ప్రణాళికతో పనిని ముగించడమే తన శైలి అని ఖిలాడీ అంటున్నారు. త‌ద్వారా బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చ‌నేది అత‌డి నిబ‌ద్ధ‌త‌.

నిజానికి ఇవి మాట‌లు కావు.. తూటాలు.. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో డిలే చేసే హీరోలంద‌రికీ క్ర‌మ‌శిక్ష‌ణా పాఠంగా కూడా అభివ‌ర్ణిస్తున్నారు. అక్షయ్ మాటలు వింటుంటే టాలీవుడ్ అగ్ర హీరోల పనితీరుపై సహజంగానే చర్చ మొదలవుతోంది. మన దగ్గర స్టార్ హీరోలకు ఒక్క సినిమా పూర్తి చేయడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతోంది. షూటింగ్ పూర్తయ్యాక కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే నెలల తరబడి నిలిపేస్తుండటంతో ఏళ్ల తరబడి తమ అభిమానులకు సైతం తెరపై కనిపించడం లేదు. ఎక్కువ సినిమాలు చేసి పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధిని పెంచాల్సిన బాధ్యత ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదనే విమర్శలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. పైగా నిర్మాతలకు వడ్డీలు.. అదనపు ఖర్చులు తగ్గించే వాతావరణం ఇక్కడ లేదంటూ ఇటీవల కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

నిజానికి ఒక పెద్ద సినిమాను 55 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయడం అంటే నిర్మాతకు దాదాపు వంద కోట్ల రూపాయల అదనపు ఖర్చును మిగిలించడమే అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్వాలిటీ, భారీతనం పేరుతో సాగతీత పనులను అక్షయ్ కుమార్ అస్సలు ఇష్టపడరట. ముందే చెప్పిన సమయానికి తన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్‌కు కూడా కచ్చితంగా చెబుతుంటారు. ఇంతటి స్పష్టత, సమయపాలన ఉన్న పెద్ద హీరో మరొకరు లేరనే చ‌ర్చ కూడా ఉంది. అయితే రోజుకు 8 గంటల పనిదినం ఒక్కటే అక్షయ్ పెట్టే ప్రధాన కండీషన్. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తరహాలోనే ఆలోచించే అక్షయ్ ఆ 8 గంటల సమయంలో మాత్రం కనీసం వ్యానిటీ వ్యాన్‌లోకి కూడా వెళ్లకుండా పూర్తి అంకితభావంతో సెట్స్‌లోనే ఉంటారు.

ప్రేక్షకులు తెరపై నటీనటులను ఎప్పుడూ ఉత్సాహంగా- అందంగా చూడాలనుకుంటారు తప్ప అలసిపోయిన ముఖాలతో కాదని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే తన 24 గంటల సమయాన్ని పక్కాగా విభజించుకున్నానని.. రోజుకు 8 గంటలు పని.. 8 గంటలు నిద్ర... 2 గంటలు వ్యాయామం.. మిగిలిన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తానని అక్కీ వివరించారు. ఇదే సమయంలో సహనటుడు రవి కిషన్ మాట్లాడుతూ.. అక్షయ్‌తో కలిసి నాలుగు సినిమాలు చేశానని.. ఆ 8 గంటల్లో ఆయన చూపే వేగం వల్ల నిర్మాతలకు భారీగా డబ్బు ఆదా అవుతుందని ప్రశంసించారు. అక్షయ్ తన సినిమాలను కేవలం 55 రోజుల్లోనే పూర్తి చేస్తారని.. దీనివల్ల యూనిట్‌లోని 300-400 మందికి నిరంతరం ఉపాధి లభించడంతో పాటు నిర్మాతలు నష్టపోకుండా ఉంటారని కొనియాడారు.

ఇలా త‌క్కువ స‌మ‌యంలో సినిమాలను 55 నుంచి 65 రోజుల్లోపే ఎలా పూర్తి చేయగలుగుతున్నారు? అనే ప్రశ్నకు అక్షయ్ హాలీవుడ్ దిగ్గజాలను ఉదాహరణగా చూపారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కూడా ఒక సినిమా షూటింగ్‌ను 90 రోజులకు మించి చేయరని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చదివాను. అలాగే టామ్ క్రూజ్ `మిషన్: ఇంపాజిబుల్` చిత్రాన్ని 55 రోజుల్లోనే పూర్తి చేశారు. పని చేయకపోతే ఇంకేం చేయాలి? అందుకే నేను ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తాను! అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడాది దీపికా పదుకొణె 8 గంటల పనివేళల డిమాండ్ కారణంగా `స్పిరిట్` ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వివాదం తర్వాత.. ఇప్పుడు అక్షయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీటౌన్‌లో మరోసారి చర్చకు దారితీశాయి. అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న `గోల్‌మాల్ 5` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ ని ఏల్తున్న స్టార్ల‌లో ఒక‌రు అయిన‌ అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటుడి స్ఫూర్తితో తక్కువ పనిదినాల్లో ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన పని వాతావరణాన్ని టాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల అగ్ర హీరోలు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వ్యక్తమవుతోంది. నాణ్యత ఏమాత్రం తగ్గకుండా.. సాగతీతకు తావులేకుండా పనిని స్మార్ట్‌గా ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్‌కే ప్రాధాన్యత ఎక్కువ ఉందని మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గ‌జన‌టుడు కూడా గతంలో సూచించిన విషయాన్ని మన స్టార్లు గుర్తుంచుకుని ఆచరిస్తే.. నిర్మాతలు సురక్షితంగా ఉండటంతో పాటు పరిశ్రమ మరింత కళకళలాడుతుంది. అంతేకాదు.. ఆ దిశ‌గా స‌రైన స‌మీక్షా సమావేశాల‌కు వేదిక క‌ల్పించి సినీపెద్ద‌లంతా ఐక్య‌వేదిక‌గా నిర్మాత‌లను క‌ష్టం నుంచి బ‌య‌ట‌ప‌డేస్తే బావుంటుంద‌ని కూడా సూచిస్తున్నారు.