దురంధర్ (X) రేస్ 4: చనిపోయినవాడిని తిరిగి బతికించడం ఎలా?
అయితే దురంధర్ సక్సెస్ తర్వాత అతడు దక్షిణాది నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి కూడా అవకాశాల్ని అందుకుంటున్నాడు.
By: Srikanth Kontham | 20 Jan 2026 9:24 AM ISTహిందీ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పేరు కొంతకాలంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం అతడు నటించిన `దురంధర్` సాధించిన భారీ విజయం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1250 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇందులో ఆయన పోషించిన రెహ్మాన్ డెకైత్ పాత్రకు విశేష ప్రశంసలు లభించాయి.
అయితే దురంధర్ సక్సెస్ తర్వాత అతడు దక్షిణాది నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి కూడా అవకాశాల్ని అందుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ రేస్ 4లో నటిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా `రేస్ 4`లో సిద్ధార్థ్ మల్హోత్రా స్థానంలో అక్షయ్ ఖన్నా నటిస్తారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత రమేష్ తౌరానీ అధికారికంగా స్పందించారు. అక్షయ్ ఖన్నాను ఈ సినిమా కోసం సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
దీనికి కారణం `రేస్` మొదటి చిత్రంలోనే అక్షయ్ ఖన్నా పాత్ర ప్రమాదంలో మరణించినట్లు చూపించామని, ఆ ట్రాక్ అక్కడితో ముగిసిపోయిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి అక్షయ్ ఖన్నా మళ్ళీ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, నటీనటులలో సిద్ధార్థ్ మల్హోత్రా లేదా సైఫ్ అలీ ఖాన్ ఉన్నారనే వార్తలను కూడా ఆయన ధృవీకరించలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, నటీనటులు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.
అయితే `రేస్ 3`లో సల్మాన్ ఖాన్ నటించినా అది విమర్శకుల నుండి తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంది. అందుకే `రేస్4` కోసం మళ్ళీ ఒరిజినల్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లేదా అక్షయ్ ఖన్నా వంటి నటులను తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దురంధర్ సంచలన విజయం సాధించడంతో అక్షయ్ ఖన్నా క్రేజ్ పెరగడం వల్ల ఈ చర్చ మరింత ఊపందుకుంది.
`దురంధర్` మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పాత్ర చనిపోయినా కానీ, ఆ పాత్రకు ఉన్న ఆదరణ దృష్ట్యా దురంధర్ 2లోను ఆయనను ఫ్లాష్‌బ్యాక్ సీన్ల ద్వారా చూపించబోతున్నారు. రెహ్మాన్ డెకైత్ కనిపిస్తే థియేటర్లలో హుషారొస్తుందనేది దర్శకరచయితల అంచనా. దాని ప్రకారమే ఆ పాత్రను రీడెవలప్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా 19 మార్చి 2026న రిలీజ్ కానుంది. అయితే చనిపోయిన పాత్రను తిరిగి చూపించడం కుదరదు కానీ, రేస్ 4లో కూడా అతడి పాత్ర గతం తాలూకా ఎపిసోడ్స్ ని చూపించేందుకు అవకాశం ఉండొచ్చు. కానీ దీనిని రేస్ 4 నిర్మాతలు ధృవీకరించలేదు.
మొత్తానికి అక్షయ్ ఖన్నా తన నటనతో.. దురంధర్ విజయంతో బాలీవుడ్‌లో మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.
