ఆ ఘర్షణ కారణంగానే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం?
జీవితంలో ఏదైనా ఒక గొప్ప పనికి సంకల్పించాలంటే, దానికి ముందు అంతో ఇంతో సంఘర్షణ కూడా అవసరం. అలాంటి సంఘర్షణలు అక్కినేని లైఫ్ లో ఎన్నో ఉన్నాయి.
By: Sivaji Kontham | 28 Aug 2025 7:00 PM ISTజీవితంలో ఏదైనా ఒక గొప్ప పనికి సంకల్పించాలంటే, దానికి ముందు అంతో ఇంతో సంఘర్షణ కూడా అవసరం. అలాంటి సంఘర్షణలు అక్కినేని లైఫ్ లో ఎన్నో ఉన్నాయి. ఆయనకు కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో తీవ్రమైన గుండె నొప్పి రావడం ఒకెత్తు అనుకుంటే, ఇతర స్టూడియోలపై ఆధారపడి తన సినిమాల షూటింగులు చేయలేని పరిస్థితుల్లో సొంతంగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలని అనుకోవడం మరొక ఎత్తు. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా, ఆయన మొక్కవోని ధీక్షతో హైదరాబాద్ నగరానికి తలమానికంగా అన్నపూర్ణ స్టూడియోస్ ని ఆరోజుల్లోనే నిర్మించి శహభాష్ అనిపించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినీప్రముఖుల కృషితో తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి తరలి రావడంలో సినీస్టూడియోల పాత్ర ఎంతో కీలకమైనది.
తాజాగా ఏఎన్నార్ పెద్ద కుమారుడు, వెటరన్ నిర్మాత అక్కినేని వెంకట్ తో సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు చర్చా ఘోష్టిలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం కావడానికి దారి తీసిన పరిస్థితులను అక్కినేని వెంకట్ రివీల్ చేసారు. ''మేం విన్నది ఏమిటంటే సారథి స్టూడియోస్ తో వివాదం కారణంగానే సొంతంగా అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమైందని విన్నాము'' అని సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించగా, ''అది వివాదం అని నేను అనను. ఆ సమయంలో చుట్టుపక్కల పరిస్థితులు అలా మార్గనిర్ధేశనం చేసాయి'' అని వెంకట్ అన్నారు. ''ఆ సమయంలోనే నాన్నగారికి తీవ్రమైన గుండె నొప్పి ఉంది. కార్టియో వాస్కులర్ డిసీజ్ ఉంటే లైట్ గా ఉంటుంది..లేదా హెవీగాఉంటుంది. నాన్నగారికి హెవీ డిసీజ్. 95 శాతం గుండె మూసుకుపోయి ఉంది. ఆరోజుల్లో భారతదేశంలో బైపాస్ ఆపరేషన్ చేసేవారు కాదు. ఆ రోజుల్లో ప్రజల్లో ఒక పెద్ద చర్చ మొదలైంది. గుండె ఆపరేషన్ తర్వాత అక్కినేని కెరీర్ ఎండ్ అయిపోతుందని టాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేయడం అంటే ఇంజిన్ రీబోర్ చేయించడమే.. లైఫ్ ని మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడమే. ఆపరేషన్ తర్వాత ఒక రకమైన జోష్ వస్తుంది లైఫ్ లోకి. అది ఊహించలేదు ఆరోజుల్లో``అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
అప్పట్లోనే కొత్త 'దేవదాస్' (ఘట్టమనేని కృష్ణ) విడుదలైంది. ఆ సినిమా వచ్చినప్పుడు క్యాంపుల్లోంచి ఒక టైప్ ఆఫ్ టాక్ వచ్చింది.. అది పాత దేవదాస్ .. కొత్త దేవదాస్ పోలిక.. రెండు సినిమాల నిర్మాణ విలువల గురించి చర్చ సాగింది. అప్పటికి నాన్న(అక్కినేని)గారు అమెరికాలో ఉన్నారు. గుండె ఆపరేషన్ ముందు నాకు ఫోన్ చేసి అడిగారు. ఆ సమయంలోనే అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ (విబి రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య కృష్ణ ప్రసాద్ మేనేజింగ్ పార్టనర్) ద్వారా పాత దేవదాస్ ని కూడా రిలీజ్ చేయమని నాన్నగారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. అక్కినేని 'దేవదాస్' 100 రోజులు ఆడింది. దానికి కొత్త `దేవదాస్` వాళ్లు కక్ష పెట్టుకున్నారు. సారథి స్టూడియోస్ వారి చెప్పు చేతల్లోనే ఉంది అప్పటికి. ఆ సమయంలో నాన్న(ఏఎన్నార్)గారు 'మహా కవి క్షేత్రయ్య' సినిమాలో నటిస్తున్నారు. షూటింగు కోసం అడిగితే సారథి స్టూడియో ఇవ్వలేమని అన్నారు. చెన్నయ్ లేదా బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే మేం ఎక్కడికో వెళ్లి షూట్ చేయడం ఎందుకు? అని నాన్నగారు నన్ను అడిగారు. నేను అప్పటికి యువకుడిని.. ఉడుకు రక్తంతో ఆలోచించాను.
అప్పటి సీఎం జలగం వెంగల్రావ్ గారిని స్టూడియో నిర్మాణం కోసం స్థలం అడిగితే ఆయన చాలా సహాయం చేసారు. ఈ రాళ్లలో ఎందుకు నాగేశ్వరరావు అన్నారు! అన్నపూర్ణ స్టూడియో పెడుతుంటే...!! ఆ ల్యాండ్ చూస్తే రాళ్లు రప్పలతో అలా కనిపించేది. అయితే ఇక్కడ భవిష్యత్ లో హైదరాబాద్ సిటీ అభివృద్ది చెందుతుందని నాన్న అంచనా వేసారు. ఆ ల్యాండ్ లో మంచి వ్యూ కూడా ఉంటుందని దానిని తీసుకుని స్టూడియో అభివృద్ధి చేసాం.. అని నాటి సంగతుల్ని వెంకట్ పూస గుచ్చినట్టు వివరించారు.
