కోడళ్లతో అక్కినేని స్పెషల్ దీపావళి సంబరాలు
అక్కినేని కుటుంబంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జున-అమల, నాగచైతన్య-శోభిత, అఖిల్-జైనాబ్ సహా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొన్నారు. శోభిత షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. రెట్రో లుక్, పాత దుస్తులను రీ-యూజ్ చేస్తూ ఫ్యాషన్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
By: Sivaji Kontham | 10 Nov 2026 9:19 AM ISTదీపావళి సంబరం అంటే ఏంటి? ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు .. దీవ్వెల కాంతులు.. ఆపై ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఒక చోట బాణా సంచా కాల్చుతూ సంబరంగా లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించడం.. వీటన్నిటినీ మించి భారతీయ పండగల విశిష్ఠతను, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయడం. ఇలాంటి వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతమాత్రం తగ్గరు. ఇప్పుడు అక్కినేని ఇంట దీవాళీ వేడుకలు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజాగా శోభిత ధూళిపాల షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతున్నాయి. వీటిలో అక్కినేని కోడళ్ల సందడి ఆషామాషీగా లేదు. అక్కా చెల్లెళ్లలా కలిసిపోయిన పెద్ద కోడలు శోభిత, చిన్న కోడలు రావూజీ సందడి ఇంటికి ప్రత్యేకమైన కాంతిని తెచ్చింది.
ఈ వేడుకల్లో అక్కినేని జంటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అక్కినేని నాగార్జున- అమల, నాగచైతన్య- శోభిత, అఖిల్- జైనాబ్ రావూజీ సహా ఇతర జంటలు కూడా సెలబ్రేషన్ లో పాల్గొనడంతో వేడుక కన్నులపండువగా మారింది. ఇక శోభిత ధూళిపాల రెట్రో లుక్‌తో పాటు అందమైన ముగ్గు వేస్తూ దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. `మేడ్ ఇన్ హెవెన్` సిరీస్‌లోని ఆమె ఐకానిక్ `తారా ఖన్నా` పాత్రను గుర్తుచేసేలా రాయల్ లుక్‌లో కనిపించిన శోభితపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యంగా, శోభిత తన పాత దుస్తులను రీ-యూజ్ చేస్తూ ఫ్యాషన్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడాన్ని ఫాలోవర్స్ గొప్పగా కొనియాడారు. నెటిజన్లు `క్వీన్ ఆఫ్ రీపర్పోసింగ్` అంటూ ఆకాశానికెత్తేశారు. ఇక చివరి ఫోటోలో దీపావళి పండుగ రోజు లేట్ నైట్ నూడుల్స్ తినడం చూసి ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తూ చర్చ నడిపారు.
మరొకవైపు తెలుగు సినీ అభిమానులు కామెంట్ సెక్షన్లలో అక్కినేని నాగచైతన్య ఫోటోల కోసం ఆరా తీశారు. పది ఫోటోలు షేర్ చేసినా చైతూతో కలిసి ఉన్న ఒక్క జంట ఫోటో కూడా లేకపోవడంతో ``వదిన గారు, అన్నా మీరు కలిసి ఉన్న ఫోటోలు ఎక్కడ?`` అంటూ సరదాగా ప్రశ్నించారు. ఏది ఏమైనా.. అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ దీపావళి సెలబ్రేషన్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ స్పెషల్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
అక్కినేని కుటుంబంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్, శోభిత వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోను ఇలా కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం కన్నుల పండుగగా మారింది. ఈ వేడుకల్లో అక్కినేని సుమంత్, ఇతర కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు.
