మూడు జనరేషన్ల అభిమానం.. సీనియర్ ఫ్యాన్ ఇంట్లో అఖిల్ సందడి
ఆ ఫోటోలు, అవార్డులు చూస్తూ సర్వేశ్వరరావుతో అఖిల్ కాసేపు మాట్లాడారు. ఆ అభిమాని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
By: M Prashanth | 11 Jan 2026 4:32 AM ISTఅక్కినేని అభిమానుల మనసులు గెలుచుకున్న యంగ్ హీరో అఖిల్ తాజాగా విజయవాడలో సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కాలం నాటి సీనియర్ అభిమాని ఎన్. సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ముచ్చటించారు. మూడు జనరేషన్లుగా అక్కినేని కుటుంబంపై అభిమానాన్ని చూపిస్తున్న సర్వేశ్వరరావుతో అఖిల్ గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఎన్. సర్వేశ్వరరావు చిన్ననాటి నుంచి అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని. ఆయన ఇంటికి వెళ్లిన అఖిల్.. అక్కడ ఉన్న నాగేశ్వరరావు, నాగార్జున ఫోటోలతో ఉన్న షీల్డులు, ట్రోఫీలు చూసి ముచ్చటపడ్డట్లు కనిపించారు. అక్కినేని కుటుంబంతో సంబంధం ఉన్న జ్ఞాపకాలను ఎంతో జాగ్రత్తగా దాచుకున్న తీరు అఖిల్ ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఆ ఫోటోలు, అవార్డులు చూస్తూ సర్వేశ్వరరావుతో అఖిల్ కాసేపు మాట్లాడారు. ఆ అభిమాని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వయసు మీద పడినా కూడా అక్కినేని కుటుంబంపై ఆయన చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూసి అఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు. సర్వేశ్వరరావును ఆత్మీయంగా హత్తుకుని తన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
అఖిల్ అక్కడ కొద్దిసేపే గడిపినా, ఆ సమయం సర్వేశ్వరరావు కుటుంబానికి మరిచిపోలేని జ్ఞాపకంగా మారింది. ఫ్యామిలీ మెంబర్స్ తో, స్థానికులతో మాట్లాడుతూ సరదాగా గడిపారు అఖిల్. కుటుంబ సభ్యులు ఆయనను తమ ఇంట్లో చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచి తమ కుటుంబంలో కొనసాగుతున్న అభిమానాన్ని గుర్తుచేస్తూ మాట్లాడారు.
మొత్తానికి అభిమాని ఇంట అఖిల్ సందడి చేసిన సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అభిమానుల ఇళ్లకు వెళ్లి, వారి ప్రేమను దగ్గరగా విట్నెస్ చేసిన అఖిల్ స్వభావాన్ని నెటిజన్లు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. హీరో అయినప్పటికీ, అభిమానులతో ఎంతో ఆత్మీయంగా మెలగడం అఖిల్ ప్రత్యేకతగా నిలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి విజయవాడలో అక్కినేని ఫ్యామిలీ సీనియర్ అభిమాని ఇంట్లో అఖిల్ చేసిన సందడి, ఆ కుటుంబం - అభిమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆ అభిమానానికి అఖిల్ ఇచ్చిన గౌరవం ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంటోంది. సూపర్ అన్న, అభిమానానికి దొరికిన పెద్ద బహుమతి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే త్వరలో అఖిల్.. లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మంచి హిట్ అందుకోవాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా విడుదలవ్వనుంది.
