Begin typing your search above and press return to search.

ఈషా.. కథ విన్నప్పుడు ఉలిక్కిపడ్డా: అఖిల్ రాజ్

కేవలం రాజు పాత్రలోనే ఉండిపోకుండా, వెర్సటైల్ యాక్టర్ అనిపించుకోవాలన్నదే తన కోరికట. అందుకే రొటీన్ కి భిన్నంగా ఈ హారర్ జోనర్ ని ఎంచుకున్నట్లు చెప్పాడు.

By:  M Prashanth   |   23 Dec 2025 11:29 PM IST
ఈషా.. కథ విన్నప్పుడు ఉలిక్కిపడ్డా: అఖిల్ రాజ్
X

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో అఖిల్ రాజ్. ఆ సినిమా సక్సెస్ కిక్కు దిగకముందే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో థియేటర్ల ముందుకు వచ్చేస్తున్నాడు. అదే 'ఈషా'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ వెనుక ఉన్నది సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ హ్యాండ్స్ కాబట్టి.

బన్నీ వాస్, వంశీ నందిపాటి అంటేనే ఈ మధ్య కాలంలో కల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి హిట్స్ తర్వాత వీరు రిలీజ్ చేస్తున్న హారర్ థ్రిల్లర్ కావడంతో అంచనాలు పెరిగాయి. హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో త్రిగుణ్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో అఖిల్ రాజ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడు తాను కూడా ఉలిక్కిపడ్డానని, ఆడియెన్స్ కు కూడా అదే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గ్యారెంటీ అని అన్నారు.

అఖిల్ ఈ సినిమాలో 'వినయ్' అనే పాత్రలో కనిపించనున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందే ఈ సినిమాకు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయినట్లు చెప్పాడు. సఖియా వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఈ ఛాన్స్ ఇచ్చారని అఖిల్ గుర్తుచేసుకున్నాడు. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథగా ఇది ఉండబోతోంది. ముఖ్యంగా హారర్ సినిమాలకు ప్రాణమైన సౌండ్ డిజైనింగ్, విజువల్స్ ఇందులో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని, గుండె ధైర్యం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ సినిమా చూడటం కష్టమేమో అని అఖిల్ హింట్ ఇచ్చాడు.

షూటింగ్ సమయంలో జరిగిన ఒక భయానక సంఘటనను కూడా అఖిల్ షేర్ చేసుకున్నాడు. అరకులో షూటింగ్ చేస్తుండగా ఒక పురుగు కుట్టడంతో ఏకంగా నెల రోజుల పాటు జ్వరంతో బాధపడ్డాడట. సినిమా కోసం అంత కష్టపడ్డానని, ఇప్పుడు అవుట్ పుట్ చూశాక ఆ కష్టమంతా మర్చిపోయానని అంటున్నాడు. దర్శకుడు శ్రీనివాస్ రాగా టేకింగ్, క్లారిటీ ఈ సినిమాకు ప్రధాన బలమని అఖిల్ చెబుతున్నాడు.

కేవలం రాజు పాత్రలోనే ఉండిపోకుండా, వెర్సటైల్ యాక్టర్ అనిపించుకోవాలన్నదే తన కోరికట. అందుకే రొటీన్ కి భిన్నంగా ఈ హారర్ జోనర్ ని ఎంచుకున్నట్లు చెప్పాడు. దెయ్యాలంటే చిన్నప్పుడు భయం ఉండేదని, వయసు పెరిగే కొద్దీ ఆ భయం పోయిందని నవ్వుతూ చెప్పాడు. కంటెంట్ ఉన్న సినిమాను ఎవరూ ఆపలేరని, మనం కష్టపడితే యూనివర్స్ కచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుందని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అఖిల్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని రివిల్ చేశాడు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో భద్రి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. మొత్తానికి 'రాజు' గా ఎమోషనల్ గా మెప్పించిన అఖిల్, ఇప్పుడు 'ఈషా'తో భయపెట్టి మరో హిట్టు కొడతాడో లేదో డిసెంబర్ 25న చూడాలి.