తమ్ముడుని వెంటాడుతోన్న పెద్దన్నయ్య!
అఖిల్ నటిస్తోన్న `లెనిన్` ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అదే సమయానికి రామ్ చరణ్ `పెద్ది` ఏప్రిల్ 30న రావడానికి సిద్ధమవ్వడంతో అఖిల్ వాయిదా వేసుకున్నాడు.
By: Srikanth Kontham | 25 April 2026 3:53 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- అక్కినేని హీరో అఖిల్ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. చరణ్‌ను అఖిల్ ఎంతో ఆప్యాయంగా పెద్దన్నయ్య అని పిలుస్తుంటాడు. చరణ్ కూడా అఖిల్ ను సొంత తమ్ముడిలా చూస్తుంటాడు. ఎలాగూ తనకంటూ సొంత తమ్మడు లేకపోవడంతో? ఆ ప్రేమను అఖిల్ పై చూపిస్తుంటాడు. వాళ్లి ద్దరు డాడ్ లు అయిన చిరంజీవి-నాగార్జున కూడా మంచి స్నేహితులు కావడంతో చరణ్-అఖిల్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంది. అయితే వెండితెరపై పోరుకు వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య అనుకోని యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది.ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చరణ్ సినిమా రిలీజ్ డేట్లు అఖిల్ సినిమాను నీడలా వెంటాడుతున్నట్లే కనిపి స్తోంది.
అఖిల్ నటిస్తోన్న `లెనిన్` ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అదే సమయానికి రామ్ చరణ్ `పెద్ది` ఏప్రిల్ 30న రావడానికి సిద్ధమవ్వడంతో అఖిల్ వాయిదా వేసుకున్నాడు. పెద్దన్నయ్య సినిమాతో పోటీ పడటం ఇష్టం లేక రిలీజ్ కావాలనే ఉద్దేశంతోనే తన సినిమాను జూన్ 26కు వాయిదా వేసుకున్నాడు. దీంతో ఈ సమస్య సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా `పెద్ది` ఏప్రిల్ నుంచి వాయిదా పడితే గనుక జూన్ 26 తేదీని టార్గెట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ ప్రచారం అఖిల్ క్యాంప్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. షూటింగ్ జాప్యం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల `పెద్ది` ఏప్రిల్ నుండి జూన్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే అఖిల్ తన సినిమాను మళ్ళీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా రెండుసార్లు అన్నయ్య సినిమా కోసమే తమ్ముడు త్యాగం చేయాల్సి రావడం విశేషమే అవుతుందప్పుడు. అలాగే `లెనిన్` చిత్రానికి సంబంధించి ఇంకా కొంత ప్యాచ్ వర్క్, కీలకమైన షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సాంకేతిక కారణాల వల్ల కూడా సినిమా జూన్ నెలలో వస్తుందా ? లేదా? అన్నది సందేహంగా మారింది. సినిమా అవుట్‌పుట్ విషయంలో అఖిల్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో లెనిన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమాతో అఖిల్ గట్టిగానే కొడతాడు అనే పాజిటివ్ వైబ్ బలంగా కనిపిస్తుంది.
రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా `పెద్ది` సినిమాకు భారీ డిమాండ్ ఉంటుంది. అఖిల్ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కావడంతో రెండు సినిమాలు ఒకే రోజు లేదా అటు ఇటుగా రిలీజ్ అయితే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చరణ్ క్లారిటీ ఇస్తే తప్ప అఖిల్ తన సినిమా రిలీజ్ ప్లాన్ ను ఖరారు చేసుకునే పరిస్థితి లేదు. ఈ బాక్సాఫీస్ దోబూచులాట ఎక్కడికి దారితీస్తుందోనని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతటి ఆప్యాయతలున్నా వ్యాపారపరంగా రిలీజ్ డేట్ల సర్దుబాటు అనేది పెద్ద సవాలుగా మారుతోంది. చరణ్ ఒక అడుగు ముందుకు వేస్తే అఖిల్ రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తోంది. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరు ముందుగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతారో చూడాలి.
