అయ్యగారికి ఇంకా పాస్ పోర్ట్ రాలేదా?
చాలా మంది అభిమానులు అఖిల్ ను కంప్లీట్ తెలుగు హీరోగా మాత్రమే చూస్తారు. అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా, చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగిన ఆయనకు భారతీయ పౌరసత్వం ఉండటం సహజమేనని అనుకుంటారు.
By: M Prashanth | 25 July 2026 11:21 AM ISTటాలీవుడ్ లో అయ్యగారు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో పెరిగి, తెలుగు సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ ఇప్పటికీ భారతీయ పౌరుడు కాదట. ఆయన వద్ద ఇంకా ఇండియన్ పాస్ పోర్ట్ కూడా లేదని చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
చాలా మంది అభిమానులు అఖిల్ ను కంప్లీట్ తెలుగు హీరోగా మాత్రమే చూస్తారు. అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా, చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగిన ఆయనకు భారతీయ పౌరసత్వం ఉండటం సహజమేనని అనుకుంటారు. అయితే అసలు నిజం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఇటీవల అఖిల్.. తాను ప్రస్తుతం అమెరికన్ సిటిజన్ నేనని, త్వరలో భారతీయ పౌరుడిగా మారే ప్రాసెస్ లో ఉన్నానని తెలిపారు.
నిజానికి అఖిల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ హోసే సిటీలో పుట్టారు. ఆ సమయంలో నాగార్జున, అమల అమెరికాలో ఉండటంతో అక్కడే ఆయన పుట్టారు. అమెరికా చట్టాల ప్రకారం అక్కడ జన్మించిన వారికి వెంటనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీంతో అఖిల్ కు చిన్నప్పటి నుంచే అమెరికన్ పాస్ పోర్ట్ ఉంది. అయితే అమెరికాలో పుట్టినప్పటికీ, ఆయన పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే.
స్కూలింగ్ లో ఎక్కువ భాగం భారత్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత పారిన్ కు వెళ్లినప్పటికీ, కెరీర్ పరంగా మాత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీనే సెలెక్ట్ చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిసింద్రీతో ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్.. తర్వాత హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరినీ ఆకట్టుకున్నారు.
అయితే ఇప్పుడు రీసెంట్ గా "నాకు అమెరికన్ సిటిజన్ షిప్ ఉంది. కానీ నేను వంద శాతం భారతీయుడినే. త్వరలో ఇండియన్ సిటిజన్ అవుతున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నెలల్లో నాకు ఇండియన్ పాస్ పోర్ట్ వస్తుంది" అని ఆయన తెలిపారు. అయితే భారతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు దేశాల పూర్తి పౌరసత్వాలు కలిగి ఉండలేరు. అందుకే అఖిల్ భారతీయ పౌరుడిగా మారాలంటే తన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో విదేశీ పౌరసత్వం కలిగిన నటులు ఉండటం కొత్త విషయం కాదు. అయితే దాదాపు హైదరాబాద్ లోనే ఉండి, తెలుగులోనే కెరీర్ కొనసాగిస్తున్న అఖిల్ ఇప్పటికీ అమెరికన్ సిటిజన్ గా ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా అయ్యగారికి ఇంకా ఇండియన్ పాస్ పోర్ట్ రాలేదా అనే ప్రశ్నకు అఖిల్ స్వయంగా ఆన్సర్ ఇచ్చేశారు. పాస్ పోర్ట్ ఇంకా రాకపోయినా, తన మనసు మాత్రం ఎప్పటి నుంచో ఇండియాదేనని చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఏదేమైనా.. ఇప్పుడు మరికొన్ని నెలల్లో అఖిల్ అఫీషియల్ గా భారతీయ పౌరుడిగా మారనున్నారన్న మాట.
