అమ్మానాన్నకు చెప్పలేనివి సుమంత్ బ్రోకే చెబుతాను: అఖిల్
చిన్నప్పటి నుంచి సుమంత్ ఒడిలోనే పెరిగానని తెలిపిన అఖిల్.. తన జీవితంలో సుమంత్‌కు ఉన్న స్థానం ప్రత్యేకమైనదని చెప్పారు.
By: Sivaji Kontham | 7 Sept 2026 9:34 AM ISTఅక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `మహేంద్రగిరి వారాహి` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ హీరో అక్కినేని అఖిల్, వేదికపై మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ వేడుకలో అఖిల్ ప్రసంగిస్తూ.. తన అన్న సుమంత్‌తో ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్నప్పటి నుంచి సుమంత్ ఒడిలోనే పెరిగానని తెలిపిన అఖిల్.. తన జీవితంలో సుమంత్‌కు ఉన్న స్థానం ప్రత్యేకమైనదని చెప్పారు. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పలేని విషయాలు లేదా అడగలేని సహాయం ఏదైనా ఉంటే, తను మొదట ఫోన్ చేసేది సుమంత్ బ్రోకేనని వివరించారు. ఏ అవసరం వచ్చినా ఎప్పుడూ కాదనకుండా తనకు అండగా నిలిచారని... ఈ రోజు ఆయన సినిమా వేడుకకు రావడం తనకు ఎంతో సంతోషాన్ని.. నేరుగా హృదయానికి తాకే పాజిటివ్ అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
ఈ సందర్భంగా సినిమా మేకర్లను అఖిల్ ప్రత్యేకంగా అభినందించారు. మధు- లక్ష్మణ్ కాంబినేషన్‌లో కంటెంట్‌ను నమ్మి పూర్తి స్థాయిలో థియేటర్లకు తీసుకొచ్చే విధానాన్ని ప్రశంసిస్తూ.. పరిశ్రమకు ఇలాంటి ధైర్యవంతులైన నిర్మాతలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన `స్టార్ బాయ్` సిద్ధు జొన్నలగడ్డను అభినందిస్తూ.. వరుస హిట్లతో బిజీగా ఉన్నా ఒక జెన్యూన్ కంటెంట్ ఉన్న సినిమాను సపోర్ట్ చేయడానికి సిద్ధు రావడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.
దర్శకుడు సంతోష్ మేకింగ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో ఓపికతో.. ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు. ఇది నేటి తరం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే `టుడేస్ సినిమా` అని.. సినిమాలో ఒక రకమైన దైవిక శక్తి (డివైన్ పవర్) కనిపిస్తోందని అఖిల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే ధీమాను, ప్రెడిక్షన్‌ను బహిర్గతం చేశారు.
అక్కినేని కుటుంబానికి `మనం`, తనకు `హాలో` లాంటి మర్చిపోలేని మ్యూజికల్ హిట్లు ఇచ్చిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన ఆర్ఆర్, పాటల ఎనర్జీపై ప్రశంసలు కురిపించారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలని కోరిన అఖిల్.. సినిమా సక్సెస్ మీట్‌కు కూడా నన్ను కచ్చితంగా పిలవాలని.. నేను మళ్లీ వస్తానని చిరునవ్వుతో కోరారు. ఇక ఈ వేదికపై సుమంత్, స్టార్ బోయ్ సిద్ధూ సహా అథితులు ఇటీవలి బ్లాక్ బస్టర్ లెనిన్ చిత్రంలో అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించడం విశేషం.
