నవ్వాలంటే నాగ్.. ఏడవాలంటే అమల.. సిసింద్రీ ప్లానింగ్ ఇలా!
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన వారు చాలామందే ఉన్నా.. కేవలం ఎనిమిది నెలల వయసులోనే స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకుల మనసులు దోచుకున్న అరుదైన ఘనత అక్కినేని అఖిల్ దే.
By: M Prashanth | 25 July 2026 1:17 PM ISTటాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన వారు చాలామందే ఉన్నా.. కేవలం ఎనిమిది నెలల వయసులోనే స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకుల మనసులు దోచుకున్న అరుదైన ఘనత అక్కినేని అఖిల్ దే. అంతేకాదు.. సినిమాలో సిసింద్రీ నవ్వు వెనుక తండ్రి నాగార్జున ఉన్నారు.. ఆయన ఏడుపు వెనుక తల్లి అమల ఉన్నారనే విషయం తాజాగా అఖిల్ రివీల్ చేయడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
అక్కినేని కుటుంబంలో మూడో జెనరేషన్ వారసుడిగా అఖిల్ చిన్నప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించారు. 1995లో విడుదలైన సిసింద్రీ చిత్రం అప్పట్లో సంచలనంగా నిలిచింది. హాలీవుడ్ చిత్రం బేబీస్ డే అవుట్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన ఆ సినిమాలో అఖిల్ లీడ్ రోల్ పోషించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 8 నుంచి 9 నెలలు మాత్రమే. అయితే తాజాగా అఖిల్.. సిసింద్రీ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
తనపై ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. షూటింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనేవారని వెల్లడించారు. "నేను డైలీ 4 గంటలు మెలకువగా ఉండేవాడిని. ఆ సమయంలో కూడా నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భాల్లో కెమెరా వెనుక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని" అని తెలిపారు.
"అలాగే ఏడవాల్సిన సన్నివేశాల కోసం అమ్మ అమల కారు ఎక్కి వెళ్లిపోయేది. అది చూసి నేను ఏడిస్తే, మూవీ టీమ్ ఆ సీన్స్ ను షూట్ చేసేది" అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు. అఖిల్ కామెంట్స్ చూస్తే.. సిసింద్రీ సినిమా వెనుక ఎంతటి సహనం, ఎంతటి ప్లానింగ్ ఉందో అర్థమవుతోంది. చిన్నారి మూడ్ కు తగ్గట్లు షూటింగ్ చేయడం, ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నివేశాలను చిత్రీకరించడం అప్పట్లోనే మూవీ టీమ్ తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలుగా చెప్పుకోవచ్చు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సిసింద్రీ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే అమల తనకు ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంస్థ బ్లూ క్రాస్ ను ప్రారంభించారని అఖిల్ తెలిపారు. దీంతో ఆ సినిమా అక్కినేని కుటుంబానికి కేవలం ఓ హిట్ మూవీ మాత్రమే కాకుండా.. ఎమోషన్స్ తో ముడిపడిన స్పెషల్ మెమోరీగా నిలిచిపోయింది.
సిసింద్రీ మూవీకి అఖిల్ కు ఫిలింఫేర్ అవార్డు కూడా రావడం విశేషం. ఇంత చిన్న వయసులోనే అవార్డు అందుకున్న నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన అఖిల్.. తర్వాత ‘మనం’లో అతిథి పాత్రలో కనిపించి, 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల తర్వాత.. తాజాగా లెనిన్ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. అయితే.. అఖిల్ కెరీర్‌లో ఎన్ని హిట్లు వచ్చినా.. ఆయనకు ప్రత్యేకమైన సినిమా మాత్రం సిసింద్రీనే అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
