అయ్యగారే నంబర్ -1.. అభిమానికి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన అఖిల్!
ప్రతి సెలబ్రిటీకి అభిమానులు ఉండడం సహజం..ఆ అభిమానుల వల్లే సెలబ్రిటీలకు కూడా ఊహించని పాపులారిటీ లభిస్తోంది.
By: Madhu Reddy | 16 July 2026 9:41 AM ISTప్రతి సెలబ్రిటీకి అభిమానులు ఉండడం సహజం..ఆ అభిమానుల వల్లే సెలబ్రిటీలకు కూడా ఊహించని పాపులారిటీ లభిస్తోంది.అయితే వందలాది మంది అభిమానులు కలసి తమ అభిమాన హీరోకి ఊహించని స్టార్ డం అందించడం వేరు.. ఒక్క అభిమాని తన హీరో విజయంలో భాగం పంచుకోవడం వేరు.. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమా సమయంలో అక్కినేని అఖిల్ అభిమానిని అంటూ అఖిల్ పేరునే పెట్టుకున్న ఆ అభిమాని.." అయ్యగారే నెంబర్ వన్.. అయ్యగారి తర్వాతే ఎవరైనా.. అయ్యగారు హిట్టు కొడతారు" అంటూ ఒక రేంజ్ లో అఖిల్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అభిమాని అఖిల్ చేసిన హంగామా కనిపించింది. ఏజెంట్ సినిమా సక్సెస్ అవ్వడానికి అభిమాని అఖిల్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు..అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అభిమానికి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన అఖిల్..
ఈ సినిమా డిజాస్టర్ తో హీరో అఖిల్ కూడా పూర్తిస్థాయిలో నిరాశ పడ్డారు. ఇక తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కుదరలేదు. మళ్లీ మూడేళ్ల తర్వాత లెనిన్ సినిమా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రకటించే వరకు కూడా ఏజెంట్ సినిమా సమయంలో కనిపించిన అభిమాని అఖిల్.. పత్తా లేకుండా పోయాడు.. మళ్ళీ మూడేళ్ల తర్వాత తన అభిమాన హీరోతో పాటే సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెట్టాడు. అఖిల్ సినిమా రిలీజ్ రోజున అఖిల్ భారీ కటౌట్ కి పెద్ద పెద్ద పూలదండలు వేస్తూ.. గుమ్మడికాయతో దిష్టితీస్తూ అయ్యగారు ఈసారి కచ్చితంగా హిట్టు కొడతారు అంటూ సినిమా విజయానికి తన వంతు ప్రమోషన్ కూడా చేశారు.
అఖిల్ కాళ్లపై పడ్డ అభిమాని..
ఎట్టకేలకు లెనిన్ సినిమా మంచి విజయం అందుకుంది. తనకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన వ్యక్తులలో అభిమాని అఖిల్ కూడా ఒక కారణం అని తెలుసుకున్న అఖిల్.. ఎట్టకేలకు అభిమానిని కలిసి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన భార్యతో సహా అభిమానిని కలిశారు. చూడగానే అభిమాని అఖిల్ వచ్చి నేరుగా అఖిల్ కాళ్లపై పడి ఏడ్చేశాడు. తమ అభిమాన నటుడిని చూశాను అన్న సంతోషంలో అభిమాని అఖిల్ కన్నీటి పర్యంతం అయిపోయారు.
నీవల్లే ఆ పేరు వచ్చింది అంటూ అభిమానిపై ప్రశంసలు..
అభిమానిని హగ్ చేసుకున్న అఖిల్ మాట్లాడుతూ.. "సంతోషమే కదా.. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరు వచ్చింది. ఈసారి ఇంకోటి హిట్ కొడదాం" అంటూ అఖిల్ తన అభిమానికి హామీ ఇచ్చారు. ఇక అభిమాన హీరోని చూసిన నేపథ్యంలో ఆ అభిమాని కన్నీటి పర్యంతం అవుతూ.. ఇంకా ఎత్తుకు ఎదగాలి అంటూ కామెంట్ చేశారు. మొత్తానికైతే అభిమానిని కలిసి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు అఖిల్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియోని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.
