ట్రెండీ టాక్: నటవారసులు నెగెటివిటీని తరిమికొట్టేలా!
మరోవైపు బాలీవుడ్ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
By: Sivaji Kontham | 4 July 2026 2:00 PM ISTసినీ పరిశ్రమలో స్టార్‌ల వారసులుగా ఎంట్రీ ఇవ్వడం సులువే అయినా.. నటులుగా తమను తాము నిరూపించుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో ఇద్దరు ప్రముఖ నటవారసులు తమ కెరీర్‌ను మలుపు తిప్పే అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరూ ఈ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఇద్దరికీ గత చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో తాజా రిలీజ్ లపై ఫుల్ హోప్స్ తో ఉన్నారు.
అక్కినేని అఖిల్ ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ లభించలేదు. ఈ నేపథ్యంలోనే అతడు నటిస్తున్న తాజా చిత్రం `లెనిన్` పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. కథానాయకుడిగా అఖిల్ నటన, అతడిలోని పరిణతి అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథాంశం తన కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతుందని అఖిల్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాను అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా నిలబెట్టేందుకు తండ్రి నాగార్జున స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నాగార్జున స్వయంగా దగ్గరుండి ఎడిటింగ్ రూమ్ పనులను పూర్తి చేయించడంతో సినిమాపై ఇండస్ట్రీలో మరింత హైప్ పెరిగింది. ఈ నమ్మకంతోనే అఖిల్ సైతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తున్న భాగ్యశ్రీ తన అందం, ప్రతిభతో మురిపిస్తుండగా.. బ్రహ్మాజీ, శివాజీ లాంటి సీనియర్ ల నటన ఈ సినిమాకు అదనపు బలంగా మారనుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ అఖిల్‌కు మైలేజ్ ఇస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక లెనిన్ దర్శకుడి ప్రతిభ గురించి సినిమా రిలీజ్ తర్వాత విస్త్రతంగా చర్చ సాగుతుందా లేదా? అన్నది విజయం డిసైడ్ చేస్తుంది.
మరోవైపు బాలీవుడ్ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో నెపోకిడ్స్‌పై ఉన్న తీవ్రమైన నెగెటివిటీ ప్రభావం ఇబ్రహీంపై కాస్త ఎక్కువే. అతడు నటించిన మొదటి చిత్రం `నాదానియాన్` లో ఇబ్రహీం నటనను కేర్ లెస్ గా తీసుకున్నాడని, బాధ్యతగల స్టార్ కిడ్‌గా కనిపించలేదని ఒక వర్గం ప్రేక్షకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వచ్చిన రెండో సినిమా సర్జమీన్ లో నటుడిగా ఓకే అనిపించుకున్నా.. అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడంలో తడబడింది. దీంతో వరుసగా రెండు ఫ్లాపులు చూసిన ఇబ్రహీంకు ఇప్పుడు మూడో సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.
ఈ సమయంలో ఇబ్రహీం అలీ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డైలర్` పై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మ్యాడక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై గత కొన్ని నెలలుగా సస్పెన్స్ కొనసాగగా.. తాజా కథనాల ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 2026 లో దీపావళి వారాంతంలో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పండుగ రోజున వచ్చే భారీ పోటీని.. డైరెక్ట్ క్లాష్‌లను వ్యూహాత్మకంగా తప్పించుకుని దీపావళి సెలవుల సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత వస్తున్న ఈ `డైలర్` చిత్రంతో ఇబ్రహీం అలీ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందుకుని బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటారో చూడాలి.
