Begin typing your search above and press return to search.

హీరోలకు 7th సెంటిమెంట్.. అఖిల్‌ కు కలిసొచ్చేనా?

టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్‌ ను పరిశీలిస్తే ఏడో సినిమాతో చాలామందికి మంచి ఫలితాలే దక్కాయి. ఎన్టీఆర్ కెరీర్‌ లో ఏడో చిత్రంగా వచ్చిన సింహాద్రి సంచలన విజయం సాధించింది.

By:  M Prashanth   |   6 July 2026 11:53 AM IST
హీరోలకు 7th సెంటిమెంట్.. అఖిల్‌ కు కలిసొచ్చేనా?
X

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవ లేదేమో. మూవీ స్టార్టింగ్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఎన్నో లెక్కలు, మరెన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌ లో అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ చర్చకు వచ్చింది. అదే హీరోల సెవెన్త్ మూవీ సెంటిమెంట్. పలువురు స్టార్ హీరోలకు కెరీర్‌ లో ఏడో సినిమా మంచి రిజల్ట్ అందించింది. కొందరికి బ్లాక్‌ బస్టర్ దక్కితే.. మరికొందరికి కెరీర్‌ లో గుర్తుండిపోయే విజయం లభించింది. దీంతో అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏడో చిత్రం లెనిన్ పై చర్చ జరుగుతోంది.

అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లెనిన్. జూలై 10న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏజెంట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్.. ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్, యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు లెనిన్ కు సెవెన్త్ మూవీ సెంటిమెంట్ కూడా తోడైంది.

టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్‌ ను పరిశీలిస్తే ఏడో సినిమాతో చాలామందికి మంచి ఫలితాలే దక్కాయి. ఎన్టీఆర్ కెరీర్‌ లో ఏడో చిత్రంగా వచ్చిన సింహాద్రి సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు ఆయన కెరీర్‌ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కెరీర్‌ లో ఏడో సినిమాగా వచ్చిన పరుగు మంచి విజయాన్ని అందుకుంది. నటుడిగానూ అల్లు అర్జున్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక రామ్ చరణ్ కెరీర్‌ లో ఏడో చిత్రంగా పరిగణించే ఎవడు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. మహేష్ బాబు విషయంలోనూ ఏడో సినిమా సెంటిమెంట్ కనిపిస్తోంది. ఆయన కెరీర్‌ లో సినిమాల కౌంట్ పై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఒక్కడుతో మహేష్‌ కు భారీ మాస్ విజయం దక్కింది. ఇలా స్టార్ హీరోల కెరీర్‌ లో ఏడో సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తున్నాయి.

అయితే ఆ సెంటిమెంట్ అందరికీ కలిసిరాలేదు. ప్రభాస్ కెరీర్‌ లో ఏడో చిత్రంగా వచ్చిన మున్నా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో హీరోల ఏడో సినిమా సెంటిమెంట్‌ కు ప్రభాస్ ఆప్షనల్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అఖిల్‌ పై పడింది. కెరీర్ ప్రారంభం నుంచి సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌ కు లెనిన్ విజయం చాలా కీలకం.

ఇతర స్టార్ హీరోలకు ఏడో సినిమా కెరీర్‌ లో కీలక విజయాలను అందించడంతో ఇప్పుడు అఖిల్ కూడా అదే సెంటిమెంట్‌ ను కొనసాగిస్తారా? ఏజెంట్ తర్వాత తీసుకున్న గ్యాప్‌ కు లెనిన్ తో సరైన రిజల్ట్ దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలా హీరోల సెవెన్త్ మూవీ సెంటిమెంట్ ఇప్పుడు లెనిన్ పై ఆసక్తిని పెంచుతోంది. మరి ఆ సెంటిమెంట్ అఖిల్‌ కు కలిసొచ్చి ఆయన ఎదురుచూస్తున్న మాస్ కమర్షియల్ సక్సెస్‌ ను అందిస్తుందో లేదో తెలియాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే.