నాన్న తర్వాత 'అయ్యగారి' హగ్గే వ్యాల్యూబుల్ అంట!
అభిమానం అనేది కొన్నిసార్లు మాటల్లో చెప్పలేనిది. ఒక హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఫ్యాన్ కు, తన ఫేవరెట్ యాక్టర్ నుంచి ఒక్క హగ్ దక్కితే.. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమోరీగా మారుతుంది.
By: M Prashanth | 25 July 2026 3:08 PM ISTఅభిమానం అనేది కొన్నిసార్లు మాటల్లో చెప్పలేనిది. ఒక హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఫ్యాన్ కు, తన ఫేవరెట్ యాక్టర్ నుంచి ఒక్క హగ్ దక్కితే.. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమోరీగా మారుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, తన వీరాభిమాని నాగరాజుతో కలిసిన సందర్భం అలాంటి ఎమోషన్ మూమెంట్ నే అందరికీ చూపించింది.
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా గుంటూరులో జరిగిన లెనిన్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తన అభిమానిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. 'అయ్యగారే నెంబర్ వన్' అంటూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన గుంటూరుకు చెందిన నాగరాజు కల ఎట్టకేలకు నెరవేరింది. ఆ మీట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖిల్ ఇటీవల మాట్లాడుతూ.. "అయ్యగారు ట్రోల్ నుంచి ఎంత అందంగా మారిందో చూశాను. ఆయనను కలిశాను.. హగ్ ఇచ్చాను. నా నాన్న హగ్ తర్వాత నాకు అంత విలువైన హగ్ అదే. ఒక్క హగ్ తో నా అభిమానులందరినీ కౌగిలించుకున్నట్లుగా అనిపించింది" అని చెప్పడం అభిమానులను మరింత భావోద్వేగానికి గురిచేసింది. గుంటూరులో జరిగిన ఈవెంట్ అనంతరం అఖిల్ తన కారవాన్‌లోకి నాగరాజును పిలిపించుకుని కొంతసేపు మాట్లాడారు.
అభిమాన హీరోను ఎదురుగా చూసిన నాగరాజు ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. అఖిల్ కాళ్లపై పడబోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే అతడిని పైకి లేపిన అఖిల్ ఆప్యాయంగా కౌగిలించుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా "నీ వల్లే నాకు 'అయ్యగారు' అనే పేరు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మనం ఇంకా చాలా హిట్లు కొట్టాలి" అని చెప్పినట్లు తెలుస్తోంది.
నాగరాజు గుంటూరుకు చెందిన పండ్ల వ్యాపారి. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సమయంలో థియేటర్ వద్ద "అయ్యగారే నెంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు" అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మొదట ట్రోల్స్ గా ప్రారంభమైన ఆ కామెంట్స్.. తర్వాత అఖిల్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపుగా మారిపోయాయి.
ఆ తర్వాత అఖిల్ సినిమా విడుదలైన ప్రతిసారీ నాగరాజు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అతడి అమాయకమైన అభిమానం చూసి పలువురు నెటిజన్లు కూడా ఒకసారి అయినా అఖిల్ ను కలిసే అవకాశం రావాలని కోరుకున్నారు. లెనిన్ సినిమా విడుదల సమయంలోనూ నాగరాజు వీడియోలు మరోసారి వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఆ కోరిక నిజమైంది. అభిమానిని కలవడమే కాకుండా, అతడిని ఆప్యాయంగా హత్తుకుని, అతని కుటుంబ సభ్యులను కూడా పలకరించడం ద్వారా అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఇదే నిజమైన స్టార్ డమ్, అభిమానిని ఇంత గౌరవంగా చూసుకోవడం గొప్ప విషయమంటూ కామెంట్లు చేస్తున్నారు. సినీ వరల్డ్ లో హీరో-ఫ్యాన్ రిలేషన్ కు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ.. అఖిల్-నాగరాజు రిలేషన్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఒకవైపు అభిమాని ప్యూర్ లవ్.. మరోవైపు హీరో చూపించిన అఫెక్షన్.. ఆ రెండు కలిసిన మూమెంట్ మెప్పించింది.
