Begin typing your search above and press return to search.

అఖండ 2: టికెట్ రేట్ల పెంపు.. స్పెషల్ షోలు.. ఏం తేడా లేదు!

నటసింహం బాలకృష్ణ సినిమా అంటే మాస్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  M Prashanth   |   10 Dec 2025 9:22 AM IST
అఖండ 2: టికెట్ రేట్ల పెంపు.. స్పెషల్ షోలు.. ఏం తేడా లేదు!
X

నటసింహం బాలకృష్ణ సినిమా అంటే మాస్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడినప్పటికి అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇక డిసెంబర్ 12న ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా సినిమా టీమ్ కు ఊరటనిచ్చే వార్త వచ్చింది.

సినిమా విడుదలకు సంబంధించిన అతి ముఖ్యమైన అనుమతులు లభించాయి. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడం ఈ మధ్య ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. నిర్మాతలకు నష్టం రాకుండా ప్రభుత్వాలు కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో డిసెంబర్ 5న రిలీజ్ అనుకున్నప్పుడే ప్రభుత్వం రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పుడు రిలీజ్ డేట్ మారినా, ఆ పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వం అదే తరహాలో స్పందించింది. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో రెగ్యులర్ రేట్లపై అదనంగా 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ పెంచిన ధరలు సినిమా రిలీజ్ అయిన రోజు (డిసెంబర్ 12) నుంచి పది రోజుల పాటు అమలులో ఉంటాయి. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది.

ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసే బెనిఫిట్ షోల విషయంలోనూ క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఒక బెనిఫిట్ షో వేసుకోవచ్చు. దీనికి టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో మొదటి రోజే మాక్సిమం రెవెన్యూ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాపై 14 రీల్స్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. సీక్వెల్ కావడంతో బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోస్ వల్ల బయ్యర్లు త్వరగా రికవరీ సాధించే అవకాశం ఉంది. వారం రోజులు ఆలస్యమైనా, ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఫైనల్ గా అడ్డంకులన్నీ తొలగిపోయి అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అయ్యింది. బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ హైక్స్, స్పెషల్ షోస్ సినిమా కమర్షియల్ సక్సెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.