Begin typing your search above and press return to search.

అఖండ 2 టికెట్ రేట్లు.. ఓ మంచి కోసమే ఇలా..

అఖండ 2 రిలీజ్ ఫీవర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఏపీలో పర్మిషన్లు వచ్చేశాయి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

By:  M Prashanth   |   4 Dec 2025 3:00 PM IST
అఖండ 2 టికెట్ రేట్లు.. ఓ మంచి కోసమే ఇలా..
X

అఖండ 2 రిలీజ్ ఫీవర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఏపీలో పర్మిషన్లు వచ్చేశాయి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సాధారణంగా సినిమా టికెట్ రేట్లు పెంచితే సామాన్యుడికి చిర్రెత్తుకొస్తుంది. జేబులు ఖాళీ అవుతున్నాయని బాధపడటం సహజం. కానీ ఈసారి బాలకృష్ణ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం వింటే, ఆ బాధ కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పెంపు వెనుక కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఒక గొప్ప ఉద్దేశం కూడా దాగి ఉంది.

భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలకు టికెట్ రేట్లు పెంచడం అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక అనివార్యమైన ప్రక్రియగా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రికవరీ కోసం దీన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ అదనపు భారం అంతా కేవలం కమర్షియల్ లాభాల కోసమేనా అనే విమర్శలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే 'అఖండ 2' టీమ్, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయానికి వస్తే.. తెలంగాణలో 'అఖండ 2' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సిద్ధమైందని టాక్ వస్తోంది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో రేట్లు పెరగనున్నాయి. అయితే, ఇక్కడ హైలైట్ అంశం ఏంటంటే.. పెంచిన ఈ అదనపు రేట్ల మొత్తంలో 20 శాతాన్ని ఛారిటీ కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అంటే టికెట్ మీద ఎక్స్ట్రాగా వసూలు చేసే ప్రతి వంద రూపాయల్లో ఇరవై రూపాయలు నేరుగా సేవా కార్యక్రమాలకు వెళ్తాయన్నమాట.

ఈ నిర్ణయం నిజంగా టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్లే. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం అలాంటి మంచి పనులకు వెళ్తుందంటే, టికెట్ కొనే ప్రేక్షకుడికి కూడా ఒక సంతృప్తి మిగులుతుంది. తాను సినిమా చూస్తూనే, పరోక్షంగా ఒక మంచి పనిలో భాగస్వామి అవుతున్నాననే భావన కలుగుతుంది.

ఒకవైపు రేట్ల పెంపుపై విమర్శలు వస్తున్న సమయంలో, ఈ ఛారిటీ యాంగిల్ ఆ విమర్శలకు కొంతమేర చెక్ పెట్టినట్లయింది. రేట్లు పెరిగినా, ఆ డబ్బు పేదవాడి అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిస్తే జనాలు కూడా పెద్దగా వ్యతిరేకించకపోవచ్చు. బాలయ్య రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఫైనల్ గా 'అఖండ 2' కేవలం బాక్సాఫీస్ లెక్కలే కాదు, సేవా దృక్పథంలోనూ కొత్త లెక్కలు నేర్పుతోంది. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం ఎలా ఉన్నా, ఈ మంచి నిర్ణయానికి మాత్రం అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.