కోర్టు క్లియరెన్స్.. డేట్ కూడా ఫిక్స్ అయినట్లే..
కానీ ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తానికి తెరపడింది. బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే గుడ్ న్యూస్ వచ్చేసింది.
By: M Prashanth | 9 Dec 2025 3:36 PM ISTనందమూరి బాలకృష్ణ అభిమానులు గత కొన్ని రోజులుగా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, సరిగ్గా విడుదల సమయంలో కోర్టు కేసులు, వాయిదా వార్తలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా ఆగిపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదన అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తానికి తెరపడింది. బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే గుడ్ న్యూస్ వచ్చేసింది.
ఎరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. నిర్మాతలు, ఎరోస్ సంస్థ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలన్నీ క్లియర్ అయ్యాయి. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టు పరిగణలోకి తీసుకుని సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో సినిమాకు ఉన్న అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా కొత్త విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న 'అఖండ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు రాత్రి కల్లా వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 5 మిస్ అయినా, వారం తిరిగేలోపే 12న వస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని, డిసెంబర్ 11 రాత్రి నుంచే షోలు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే రిలీజ్ డేట్ కంటే ముందే బాలయ్య జాతర మొదలవ్వబోతోందన్నమాట.
అయితే సడన్ గా డేట్ ఫిక్స్ అవ్వడం వల్ల ఓవర్సీస్ మార్కెట్ లో అనుకున్నంత భారీ రిలీజ్ దొరక్కపోవచ్చు. అక్కడ థియేటర్ల అడ్జస్ట్మెంట్ కష్టమవ్వచ్చు. కానీ ఒక్కసారి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం లెక్కలన్నీ మారిపోతాయి. మార్కెట్ లో మాత్రం బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. ఆ మాస్ హిస్టీరియా ముందు ఏదీ నిలబడదు.
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బోయపాటి టేకింగ్, బాలయ్య యాక్షన్.. ఈ మూడు గనక మొదటి పార్ట్ లాగే కుదిరితే బాక్సాఫీస్ దగ్గర రాంపేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఒక్కటే.. పాజిటివ్ టాక్. అది గనక వస్తే ఆకాశమే హద్దుగా వసూళ్లు ఉంటాయి. మరి సినిమాకు టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
