అప్పుడు రవితేజ.. ఇప్పుడు బాలయ్య
కొత్త సినిమాలకు ఫైనాన్స్ ఇష్యూస్ తలెత్తి.. రిలీజ్ ముంగిట బ్రేక్ పడడం.. షోలు ఆలస్యం కావడం.. లేదా సినిమానే వాయిదా పడడం టాలీవుడ్‌కు కొత్త కాదు.
By: Garuda Media | 5 Dec 2025 2:55 PM ISTకొత్త సినిమాలకు ఫైనాన్స్ ఇష్యూస్ తలెత్తి.. రిలీజ్ ముంగిట బ్రేక్ పడడం.. షోలు ఆలస్యం కావడం.. లేదా సినిమానే వాయిదా పడడం టాలీవుడ్‌కు కొత్త కాదు. కానీ ‘అఖండ-2’ లాంటి పెద్ద సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడమే ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. భారీ చిత్రాల విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ముందే సెటిల్ చేసుకుంటారు. రిలీజ్‌కు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకుంటారు. చిన్న-మిడ్ రేంజ్ సినిమాలకు ఫైనాన్స్ ఇష్యూస్ తలెత్తినపుడు మార్నింగ్ షోల వరకు బ్రేక్ పడుతుంటుంది. మ్యాట్నీల సమయానికి అంతా సెటిల్ అయిపోతుంటుంది. కానీ ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రానికి ఇలా ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఆగిపోవడం.. రిలీజ్ రోజు కూడా షోలు పడకపోవడం మాత్రం అరుదైన విషయం.
గతంలో ‘అరుంధతి’ సినిమాకు చివర్లో సమస్యలు తలెత్తి ఒక రోజు రిలీజ్ ఆలస్యమైంది. కానీ అప్పుడు సినిమా ఫైనల్ కాపీ రెడీ కాకపోవడం వల్లే సమస్య తలెత్తింది. ఒక రోజు లేటైనప్పటికీ సినిమాకు అద్భుతమైన స్పందన రావడంతో అది బ్లాక్ బస్టర్ అయింది. ఒక రోజు ఆలస్యం అన్నది పెద్ద సమస్యగా మారలేదు. ఇక కొన్నేళ్ల ముందు సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ మూవీకి ‘అఖండ-2’ తరహాలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ సమస్యలు తలెత్తాయి. ఉదయం నుంచి సినిమా కోసం ఎదురు చూసి చూసి అభిమానులు అలసిపోయారు. చివరికి రాత్రి షోలు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఐతే అఖండ-2కు ఎదురైంది ఇంకా పెద్ద సమస్య. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఆగిపోయాయి. రిలీజ్ రోజూ షోలు పడలేదు. కనీసం సినిమా 24 గంటలు ఆలస్యం కాబోతోంది. అంతకుమించినా ఆశ్చర్యం లేదు. అసలు ఈ వీకెండ్లో సినిమా రిలీజవుతుందా లేదా అనే సందేహాలూ కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ.. అరుంధతి, క్రాక్ సినిమాల్లాగే ఆలస్యంగా రిలీజైనా సరే సినిమా పెద్ద హిట్టయితే చాలనుకుంటున్నారు అభిమానులు.
