Begin typing your search above and press return to search.

ఆ డేటే కావాలి.. బాలయ్య ఫ్యాన్స్ ఉద్యమం

అఖండ-2 డిసెంబరు 24న రావొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా.. నందమూరి అభిమానులు భగ్గుమన్నారు.

By:  Garuda Media   |   8 Dec 2025 1:18 PM IST
ఆ డేటే కావాలి.. బాలయ్య ఫ్యాన్స్ ఉద్యమం
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య గత శుక్రవారం రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా వస్తుందేమో అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆ వీకెండ్ మిస్ అయ్యాక కొత్త డేట్ ఏదా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆదివారం ఈ విషయం మీద హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సమావేశం కూడా జరిగింది.

ఇందులో ప్రధానంగా డిసెంబరు 12, 24 డేట్ల మీద డిస్కషన్ నడిచినట్లు తెలుస్తోంది. డిసెంబరు 12 అయితే హడావుడి అయిపోతుందని.. కొద్దిగా టైం తీసుకోవడం మంచిదని, అన్ని విషయాలూ చూసుకుని క్రిస్మస్ సీజన్లో 24న రిలీజ్ చేస్తే బెటరని మెజారిటీ అభిప్రాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇందుకు బాలయ్య అభిమానులు మాత్రం ఎంతమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది.

అఖండ-2 డిసెంబరు 24న రావొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా.. నందమూరి అభిమానులు భగ్గుమన్నారు. అన్నిరోజులు సినిమా కోసం ఆగలేమంటూ వాళ్లు ఆన్ లైన్ ఉద్యమానికి రెడీ అయ్యారు. డిసెంబరు 12నే ‘అఖండ-2’ను రిలీజ్ చేయాలంటూ వాళ్లు హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే 50 వేలకు పైగా ట్వీట్లు పడ్డాయి ఈ హ్యాష్ ట్యాగ్ మీద. 12న సినిమాను రిలీజ్ చేయాలన్నది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ అంటూ వాళ్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు.

డిసెంబరు 5న సినిమాను రిలీజ్ చేయకపోవడం ద్వారా తమకు తీవ్ర మనోవేదన కలిగించారని, అయినప్పటికీ మౌనంగా ఈ బాధను భరించామని.. ఇంకో రెండు వారాలకు పైగా వెయిట్ చేయడం తమ వల్ల కాదని.. ఏం చేసైనా 12న సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ అంటే ఈ రోజు తుది నిర్ణయం తీసుకుని.. వరల్డ్ వైడ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసుకోవాలి. టికెట్ల రేట్లు, స్పెషల్ షోలపై జీవో తెప్పించుకోవాలి. బుకింగ్స్ చూసుకోవాలి. అదంత తేలిక కాదని ‘అఖండ-2’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. మరి 24నే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే.. ఈలోపు అభిమానుల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారో చూడాలి.