Begin typing your search above and press return to search.

అఖండ 2 ఓవర్సీస్.. ఇది పెద్ద పరీక్షే!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  M Prashanth   |   11 Dec 2025 3:35 PM IST
అఖండ 2 ఓవర్సీస్.. ఇది పెద్ద పరీక్షే!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డివోషనల్ టచ్ తో కూడిన మాస్ సినిమా కావడంతో ఫ్యామిలీస్, మాస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అఖండ ముందు వరకు బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ లో ఒక లిమిటెడ్ మార్కెట్ ఉండేది. కానీ అఖండ సినిమా ఆ లెక్కలను మార్చేసింది. దీంతో సీక్వెల్ కు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ రైట్స్ మొత్తం ఒకే బయ్యర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట అనుకున్న డీల్ కు, ఇప్పటి పరిస్థితికి కొంత తేడా వచ్చింది. సినిమా విడుదల వాయిదా పడటం, అనుకున్న సమయానికి రాకపోవడంతో ఫైనాన్షియల్ గా డీల్స్ లో కొన్ని మార్పులు జరిగాయట.

దీంతో ఇప్పుడు నార్త్ అమెరికాలో 'అఖండ 2' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రివైజ్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా అక్కడ సేఫ్ జోన్ లోకి రావాలంటే ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉందట. ఇది చిన్న టార్గెట్ ఏమీ కాదు. బాలయ్య కెరీర్ లోనే ఇది ఓవర్సీస్ లో అత్యంత పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. గతంలో బాలయ్య సినిమాలు అక్కడ మంచి విజయాలు సాధించినా, ఈ మార్క్ ను టచ్ చేయడం అనేది ఒక సవాలే.

ఎందుకంటే బాలకృష్ణ కెరీర్ లో అక్కడ హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలు కూడా ఈ నెంబర్ కు కొంచెం దూరంలోనే ఆగిపోయాయి. ఉదాహరణకు సూపర్ హిట్ అయిన 'భగవంత్ కేసరి' అక్కడ సుమారు 1.26 మిలియన్ డాలర్లు రాబట్టింది. అలాగే 'వీరసింహారెడ్డి' కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది. అంటే ఇప్పుడు 'అఖండ 2' హిట్ అనిపించుకోవాలంటే బాలయ్య తన పాత రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.

నిజానికి 1.5 మిలియన్ డాలర్లు అనేది మిగతా స్టార్ హీరోలకు సాధారణ విషయం కావచ్చు కానీ, బాలయ్య మార్కెట్ కు ఇది గట్టి టార్గెట్. సినిమా టాక్ ఏమాత్రం తేడా కొట్టినా బయ్యర్లకు నష్టాలు తప్పవు. కేవలం ఆరంభంలో వచ్చే ఓపెనింగ్స్ మీదే కాకుండా, లాంగ్ రన్ ఉంటేనే ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటగలరు.

అయితే అఖండ సిరీస్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, శివ తత్వం సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈ టార్గెట్ ను రీచ్ అవ్వడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే కంటెంట్ ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. మామూలు హిట్ టాక్ వస్తే సరిపోదు, బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే నార్త్ అమెరికాలో బాలయ్య ఈ 1.5 మిలియన్ డాలర్ల మార్క్ ని దాటగలరు. మరి బాలయ్య ఈ టార్గెట్ ను ఎలా ఛేదిస్తారో చూడాలి.