అఖండ 2లో బాలయ్య 'సూపర్ హీరో'నా?
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Dec 2025 11:18 AM ISTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డివైన్ ఎలిమెంట్స్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన విడుదలైంది.
ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా.. అందులో యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అఖండ-2లో కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని అంతా అనుకున్నారు. కానీ అవి అభిమానులకు నచ్చగా.. మిగతా ఆడియన్స్ ను మాత్రం చాలా వరకు డిస్సపాయింట్ చేశాయి.
ఎందుకంటే.. సినిమాలోని యాక్షన్ సీన్స్ అతిగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. విజువల్స్ షేర్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. కొన్ని సీన్స్ కు అసలు లాజిక్ లేదని అంటున్నారు. ఒకటి రెండు అలా ఉంటే పర్లేదు కానీ.. చాలా వరకు అలాగే ఉన్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు ట్రోలింగ్‌పై డైరెక్టర్ బోయపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. కొన్ని సీన్లకు లాజిక్కే లేదంటూ వస్తున్న ట్రోల్స్ పై మాట్లాడారు. సినిమాలో అఖండ రోల్ లో అఘోరను అష్ట సిద్ధి సాధించిన వ్యక్తిగా, అష్ట దిగ్బంధనం లోనికి వెళ్లి 12 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినట్లు చూపించామని తెలిపారు.
అప్పుడు ఆయన సూపర్ హ్యూమన్ గా మారిన వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తికి లాజిక్, మ్యాజిక్ అవసరం లేదని తెలిపారు. అష్ట సిద్ధుల వల్ల అఘోరను అసాధారణమైన వ్యక్తిగా చూపించామని, అంతటి గొప్ప వ్యక్తులు తలుచుకుంటే నానో ఆకారానికి వెళ్లగలరని, అంతే కాదు విశ్వరూపాన్ని కూడా చూపించగలరని అన్నారు.
అయితే తాము అంత దూరం వెళ్లలేదని, కేవలం ఆయుధాలతో మాత్రమే గేమ్ ఆడామని బోయపాటి శ్రీను తెలిపారు. ఓ సూపర్ హీరో.. సమయం, సందర్భం బట్టి ఏ విధంగా అయినా మారుతాడని చెప్పుకొచ్చారు. అందుకే లాజిక్ లేకపోవడం కాదు, లాజిక్ క్లియర్ గా ఉందని అన్నారు. అఖండ 2 సినిమా కాదని... భారతదేశ ఆత్మ అంటూ వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
