Begin typing your search above and press return to search.

జాక్ పాట్ సినిమా ఇస్తే.. ఇలా చేస్తారా?

సాధారణంగా ఒక సినిమాకు సీక్వెల్ చేస్తుంటే.. తొలి సినిమా చేసిన నిర్మాతలే దాన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. వారికే ఆ ప్రయోజనం దక్కాలని అందరూ భావిస్తారు. కానీ బాలకృష్ణ- బోయపాటి శ్రీను మాత్రం భిన్నంగా ఆలోచించారు.

By:  Garuda Media   |   5 Dec 2025 3:29 PM IST
జాక్ పాట్ సినిమా ఇస్తే.. ఇలా చేస్తారా?
X

‘అఖండ’ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ మాత్రమే కాదు.. అనేక రకాలుగా ప్రత్యేకం. బాలయ్య నట ప్రతిభ ఎలాంటిదో ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా అది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపాన్ని చూసి ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ సినిమా ఓటీటీలో పాన్ ఇండియా హిట్ అయింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే.. ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు.

సాధారణంగా ఒక సినిమాకు సీక్వెల్ చేస్తుంటే.. తొలి సినిమా చేసిన నిర్మాతలే దాన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. వారికే ఆ ప్రయోజనం దక్కాలని అందరూ భావిస్తారు. కానీ బాలకృష్ణ- బోయపాటి శ్రీను మాత్రం భిన్నంగా ఆలోచించారు. మిర్యాల రవీందర్ రెడ్డిని తప్పించి.. 14 రీల్స్ అధినేతలకు సినిమాను అప్పగించారు. రవీందర్ రెడ్డి కాదంటే.. ఈ సినిమాను టేకప్ చేయడానికి టాలీవుడ్లో పెద్ద పెద్ద బేనర్లు ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమా తీయడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ కారణాలేంటో కానీ.. బాలయ్య, బోయపాటి మాత్రం రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలకే ఈ సినిమా చేశారు.

1 నేనొక్కడినే, ఆగడు లాంటి డిజాస్టర్లు.. సర్కారు వారి పాట లాంటి యావరేజ్ మూవీతో దెబ్బ తిన్న 14 రీల్స్ వాళ్లకు ‘అఖండ-2’ లాంటి సినిమా దక్కడం అంటే జాక్ పాట్ అన్నట్లే. ఈ ఒక్క సినిమాతో వారి కష్టాలన్నీ తీరిపోయే మార్గం దొరికింది. బాగా ఆలస్యం అవుతున్న ‘టైసన్ నాయుడు’తో పాటు ఆల్రెడీ లైన్లో పెట్టిన సినిమాలను కూడా ముందుకు తీసుకెళ్లడానికి ‘అఖండ-2’ను ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ సినిమాకు భారీ లాభం సంపాదించే అవకాశం కూడా లభించింది. బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా హిట్టయితే మంచి లాభాలు అందుకోవడమే కాదు.. మళ్లీ తమ బేనర్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తే.. తర్వాతి సినిమాలకు బాగా ఉపయోగపడుతుందనుకున్నారు.

కానీ ఇంత మంచి అవకాశాన్ని ఇప్పుడు చేజేతులా నాశనం చేసుకున్నట్లయింది. ఈరోస్ వాళ్లతో ముందే సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారాన్ని ఇక్కడిదాకా తెచ్చుకున్నారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండా చూసుకోవడంలో విఫలమవడంతో ఇప్పుడు వ్యవహారం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గురువారం పెయిడ్ ప్రిమియర్స్ ఆగిపోవడం.. శుక్రవారం కూడా షోలు పడకపోవడంతో ఇప్పటికే కనీసం పది కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఈ రోజు రాత్రికైనా షోలు పడకపోతే.. నష్టం ఇంకా పెరగడం ఖాయం. ఈ సినిమా నుంచి రాబట్టుకోవాలనుకున్న లాభం దక్కకపోగా.. తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుని ప్రొడక్షన్ హౌస్ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టుకున్నారు 14 రీల్స్ అధినేతలు.