Begin typing your search above and press return to search.

టికెట్ల ధరల సంగతి సరే.. బస్సు టికెట్ల మాటేంటి?

సినిమా టికెట్ల ధరల మీద ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా అదనపు రేట్లు వడ్డించడం మీద ప్రేక్షకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

By:  Garuda Media   |   29 Nov 2025 11:39 PM IST
టికెట్ల ధరల సంగతి సరే.. బస్సు టికెట్ల మాటేంటి?
X

సినిమా టికెట్ల ధరల మీద ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా అదనపు రేట్లు వడ్డించడం మీద ప్రేక్షకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంవత్సరం మొత్తం మీద ఇలా రేట్లు పెంచేది పది పన్నెండు సినిమాలకు మాత్రమే అని.. అవి కూడా పెద్ద బడ్జెట్లు పెట్టిన సినిమాలకే అని.. ఎక్కువ ఖర్చు పెట్టి ప్రేక్షకులకు ఇంకా బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నపుడు రేట్లు పెంచితే తప్పేంటని ఫిలిం మేకర్స్ వాదిస్తే.. తాము థియేటర్లకు వచ్చేదే పెద్ద సినిమాల కోసమని.. అలాంటి చిత్రాలకే రేట్లు పెంచి తమను థియేటర్లకు రాకుండా నిరుత్సాహ పరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

దీని మీద ఎవరి వాదన వాళ్లదే. రేట్ల పెంపు వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా సరే.. నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి పెద్ద సినిమా ‘అఖండ-2’కు కూడా రేట్ల పెంపు ఖాయమని తెలుస్తోంది. దీనిపై ఎదురవుతున్న అభ్యంతరాల గురించి ‘అఖండ-2’ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పెద్ద సినిమాలకు టికెట్ రేటు మీద రూ.100 పెంచడంలో తప్పేమీ లేదని.. అది చాలా రీజనబుల్ అని రామ్, గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. అన్ని సినిమాలకూ రేట్లు పెంచట్లేదు కదా, పెద్ద సినిమాలకు.. సగటున నెలకు ఒక చిత్రానికి మాత్రమే రేటు పెరుగుతుందని వారన్నారు. రేట్లు పెరగని సినిమాలను జనాలు చూస్తున్నారా అని వారు ప్రశ్నించారు. డిమాండ్-సప్లై ఆధారంగానే ఏదైనా జరుగుతుందంటూ రామ్, గోపీనాథ్ ఒక ఉదాహరణ చెప్పారు. పండుగలప్పుడు బస్సు టికెట్ల ధరలను పెంచడం గురించి వారు ప్రస్తావించారు. ఆ సమయాల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని.. 500 ఉండే బస్సు టికెట్ ధరను 1500, 2000కు పెంచుతారని.. స్వయంగా ప్రభుత్వమే ఆర్టీసీ టికెట్ల ధరలను పెంచుతుందని.. ఇది క్యాష్ చేసుకోవడమే కదా.. దీని గురించి ఎవరూ మాట్లాడరేంటని వారు ప్రశ్నించారు.

అవసరం కాబట్టి రేటు ఎక్కువ ఉన్నా జనం ప్రయాణం చేస్తారని.. అలాగే ఒక సినిమాను చూడాలి అనుకున్న వాళ్లే ఎక్కువ రేటు పెట్టి థియేటర్లకు వస్తారని వారు అభిప్రాయపడ్డారు. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ రేటు పెట్టడం న్యాయమే అని భావిస్తున్నపుడు.. ఇంకెవ్వరూ దీని విషయంలో ఏం మాట్లాడతారని వారు ప్రశ్నించారు.