Begin typing your search above and press return to search.

నిర్మాతలూ.. ఈ నష్టాన్ని గుర్తిస్తున్నారా?

టాలీవుడ్లో ఇంకో పెద్ద సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆటోమేటిగ్గా టికెట్ల రేట్లూ పెరిగిపోయాయి.

By:  Garuda Media   |   4 Dec 2025 9:45 PM IST
నిర్మాతలూ.. ఈ నష్టాన్ని గుర్తిస్తున్నారా?
X

టాలీవుడ్లో ఇంకో పెద్ద సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆటోమేటిగ్గా టికెట్ల రేట్లూ పెరిగిపోయాయి. ఏ పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామో నిర్మాతల వైపు నుంచి ఎన్ని వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. ప్రేక్షకులైతే ఈ విషయంలో సానుకూలంగా లేరన్నది స్పష్టం. రేట్ల పెంపు అంశంలో ప్రేక్షకుల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్న మాట వాస్తవం. ఐతే ఇలా రేట్లు పెంచి నిర్మాతలు నిజంగా ప్రయోజనం పొందుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

అదనపు షోలు వేయాలని, టికెట్ల ధరలు పెంచుకోవాలని అనుకున్నపుడు సరైన ప్లానింగ్ ఉండడం చాలా కీలకం. కనీసం పది రోజుల ముందు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని విడుదలకు ఐదారు రోజుల ముందు జీవో వచ్చేలా చూసుకుంటే మంచిది. కానీ నిర్మాతల వైపు ఆలస్యం జరుగుతోందా.. లేకా ప్రభుత్వాల వైపు నుంచి నాన్చుతున్నారా అన్నది తెలియడం లేదు కానీ.. జీవోలు రావడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. దాని తాలూకు ప్రతికూల ప్రభావం బుకింగ్స్ మీద గట్టిగా పడుతోంది.

కొన్ని నెలల కిందట పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’కు ఏపీలో త్వరగానే జీవో వచ్చేసింది. కానీ తెలంగాణలో విడుదలకు ముందు రోజు వరకు జాప్యం జరిగింది. చాలా లేటుగా బుకింగ్స్ మొదలయ్యాయి. బెనిఫిట్ షోలకు ఏకంగా రూ.వెయ్యి రేటు పెట్టడం వల్ల ఆదాయం పెరిగి ఉండొచ్చు కానీ.. లేట్ బుకింగ్స్ వల్ల జరిగిన నష్టం తక్కువేమీ కాదు. నాలుగైదు రోజుల ముందు బుకింగ్స్ మొదలైతే.. వీకెండ్ మొత్తానికి ముందే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యే అవకాశముంటుంది. జాప్యం వల్ల ఇందులో కోత పడుతుంది.

ఇప్పుడు ‘అఖండ-2’ విషయానికి వస్తే.. ‘వీరమల్లు’ కంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ముందు రోజు సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్ వేయడానికి థియేటర్ల యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. ఈ షోకు స్పెషల్ రేటు ఉంటుంది. దీంతో పాటు తొలి వారం రోజులకు టికెట్ల రేట్లు పెంపు ఆశిస్తున్నారు. ఇందుకోసమని రిలీజ్ ముందు రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనూ తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. రెండు మూడు రోజులుగా టికెట్ల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయారు అభిమానులు. దీని వల్ల ఎంత సమయం వృథా అవుతుందో.. వారిలో ఎంత అసహనం పెంచుతుందో చెప్పేదేముంది? అసలే రేట్లు పెంచుతున్నారు. పైగా బుకింగ్స్ ఆలస్యం.. దీని వల్ల సినిమా మీద నెగెటివిటీ ముసురుకోదా? ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టమెంతో అంచనా వేయగలరా?

చివరికి చూస్తే రేట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకో, ఛారిటో కోసమో ఉపయోగించాలనే షరతు ఉంది. ఇది పోగా చివరికి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అదనపు ఆదాయం ఎంత? దీని బదులు నార్మల్ రేట్లతో నాలుగైదు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. ‘అఖండ-2’ లాంటి క్రేజీ మూవీకి ఎంత పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగేవి. వీకెండ్ అంతా షోలు ఫుల్ అయిపోయేవి కావా? ఫుట్ ఫాల్స్ పెంచుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉండేది. అదనపు రేట్లతో వచ్చే ఆదాయం కన్నా.. ఈ పెంపు, జాప్యం వల్ల పెరుగుతున్న నెగెటివిటీ, తగ్గుతున్న ఫుట్ ఫాల్స్ వల్ల జరిగే నష్టమే ఎక్కువ అని నిర్మాతలు అర్థం చేసుకుంటే మంచిదేమో.