బాలయ్య- తమన్.. మరోసారి స్పీకర్లు బద్దలవడం పక్కానా?
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ- ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
By: M Prashanth | 29 Nov 2025 6:00 PM ISTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ- ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన వివిధ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించారు. డిక్టేటర్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.
ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వడంలో.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తమన్ వర్క్.. అందరినీ తెగ మెప్పించింది. బాలయ్య యాక్టింగ్ కు.. డైరెక్టర్లు ఇచ్చిన ఎలివేషన్స్ కు పెర్ఫెక్ట్ గా సరిపోయింది. అందుకే నందమూరి తమన్ అంతా పిలుచుకుంటూ ఉంటారు.
అయితే తమన్ మరోసారి బాలయ్య సినిమాకు వర్క్ చేశారు. నటసింహం లీడ్ రోల్ లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ సీక్వెల్ అఖండ-2కు మ్యూజిక్ అందించారు. దీంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోసారి తమన్ మ్యూజిక్ రిపీట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతే కాదు.. స్పీకర్లు బద్దలవ్వడం పక్కా అని చెబుతున్నారు.
ఇప్పటికే పలు సినిమాల టైమ్ లో కొన్ని థియేటర్స్ లో స్పీకర్లలో మంటలు వచ్చాయి.. కొన్ని కింద కూడా పడిపోయాయి.. ఆ సమయంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఆ విషయాన్ని ఇప్పుడు తమన్.. అఖండ-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించారు. ఈసారి కూడా ముందు కన్నా మించిన రేంజ్ లో మ్యూజిక్ అందించినట్లు పరోక్షంగా తెలిపారు.
డిసెంబర్ 5న ఎవరు కూడా బాక్సులు పగిలిపోయాయని, స్పీకర్లు పేలిపోయాయని, ఫైర్ అయిందని కంప్లైంట్ చేయకూడదని అన్నారు. అందుకే ముందే స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండని థియేటర్స్ ఓనర్స్ కు సూచించారు. దేవుడికి హారతి ఇచ్చినప్పుడు.. తాళాలు కొడతామని, డ్రమ్ములు కొడతామని.. ఇప్పుడు అఖండ-2కు సేమ్ అలాగేనని తెలిపారు.
సినిమాలో హై వచ్చినప్పుడు.. కొట్టకుండా ఎలా ఉంటానని.. చేతులు కట్టుకుని ఉండను కదా అని నవ్వుతూ అన్నారు. బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారని కొనియాడారు. డిసెంబర్ 5వ తేదీన బాలయ్య గారితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అని తెలిపారు. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు పని చేయడమంటే.. మామూలు విషయం కాదని, ఎంతో అదృష్టం ఉంటేనే జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
