'అఖండ' సెన్సార్.. బోయపాటి సేఫ్ గేమ్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న 'అఖండ 2: తాండవం' విడుదలకు సర్వం సిద్ధమైంది.
By: M Prashanth | 30 Nov 2025 12:14 PM ISTనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న 'అఖండ 2: తాండవం' విడుదలకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. సినిమాపై ఉన్న అంచనాల నడుమ, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించింది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఇందులో యాక్షన్ మోతాదు గట్టిగానే ఉన్నా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేలా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేశారని అర్థమవుతోంది. సాధారణంగా బోయపాటి సినిమాల్లో వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే U/A వచ్చిందంటే, డివోషనల్ టచ్ సినిమాను సేఫ్ జోన్ లో ఉంచిందని భావించవచ్చు.
ఈమధ్య కాలంలో వైలన్స్ కొంచెం ఎక్కువైనా కూడా A సెన్సార్ రావడం చూస్తున్నాం. కానీ బోయపాటి వైలెన్స్ డోస్ మించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. అఘోరా గెటప్ లో బాలయ్య విలన్స్ ని ఊచకోత కోసే సీన్స్ ఉన్నా కూడా ఈ తరహాలో సెన్సార్ రావడం ఊహించని ట్విస్ట్.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య లుక్ చాలా సీరియస్ గా ఉంది. చేతిలో గద పట్టుకుని, అఘోరా గెటప్ లో నడుచుకుంటూ వస్తున్న తీరు సినిమాలో ఉండబోయే ఇంటెన్సిటీని సూచిస్తోంది. వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం, దేవాలయాల బ్యాక్ డ్రాప్ చూస్తుంటే.. కథలో దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం బలంగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది.
మొదటి భాగం 'అఖండ'లో శివుడి రిఫరెన్స్ ఉంటే, ఈసారి హనుమంతుడి ప్రస్తావన కూడా ఉంటుందని పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే రన్ టైమ్, కథనం విషయంలో మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో, ఇతర భాషల్లోనూ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది కాబట్టి, ఓపెనింగ్స్ ఈ సినిమాకు చాలా కీలకం కానున్నాయి.
సాంకేతిక పరమైన, చట్టపరమైన పనులన్నీ పూర్తయ్యాయి. ఇక మిగిలింది బాక్సాఫీస్ తీర్పు మాత్రమే. మాస్ యాక్షన్ కు, భక్తి రసాన్ని జోడించి బోయపాటి చేసిన ఈ ప్రయత్నం సీక్వెల్ సెంటిమెంట్ ను నిలబెడుతుందా? లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఫ్యాన్స్ మాత్రం బాలయ్య 'తాండవం' కోసం వెయిటింగ్.
