అఖండ 2 చరిత్ర సృష్టిస్తుంది: ఎన్బీకే
తాజా ఈవెంట్లో నటసింహం నందమూరి బాలకృష్ణ సహా బోయపాటి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఎన్బీకే మాట్లాడుతూ.. ``ఇలాంటి భారీ సినిమాని తెరకెక్కించడం అంత సులువు కాదు.
By: Sivaji Kontham | 14 Nov 2025 10:24 PM ISTనందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఎన్బీకే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా రాక కోసం వేచి చూస్తుండగా, ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తూ బోయపాటి టీమ్ ప్రచారంలో వేగం పెంచింది.
తాజా ఈవెంట్లో నటసింహం నందమూరి బాలకృష్ణ సహా బోయపాటి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఎన్బీకే మాట్లాడుతూ.. ``ఇలాంటి భారీ సినిమాని తెరకెక్కించడం అంత సులువు కాదు. ఇతరులు సంవత్సరాలు తీసుకుంటుంటే, తాము 130 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాం`` అని తెలిపారు. ఈ చిత్రం భారతీయ సినీరంగంలో చరిత్ర సృష్టిస్తుందని ఎన్బీకే గర్వంగా పేర్కొన్నారు. ``అఖండ అనేది సాధారణమైన చిత్రం కాదు.. అఖండ 2 సినిమా కంటే చాలా పెద్దది.. అంతకంటే ఉత్తమమైన సినిమా.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి.. కంటెంట్ పవర్ అలాంటిది`` అని అన్నారు.
స్వరకర్త థమన్ పైనా ఎన్బీకే ప్రశంసలు కురిపించారు. తమ కలయికలో మరిన్ని హిట్‌లను కూడా ఇస్తామని వ్యాఖ్యానించారు. హర్షాలీ పాత్ర, ఆది పినిశెట్టి పాత్ర మాసీగా ఉంటాయని కూడా అన్నారు. డిసెంబర్ 5న వస్తున్న అఖండ 2 పాన్-ఇండియా సెన్సేషన్ అవుతుందని ఎన్బీకే నమ్మకం వ్యక్తం చేసారు. తేజస్విని నందమూరి ఎం సమర్పణలో 14 రీల్స్ ప్లస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.
సంక్రాంతి బరిలోనే?
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ 2 ని కూడా 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని తొలుత చిత్రబృందం భావించింది. కానీ డిసెంబర్ 5న విడుదలవుతుందని అధికారికంగా టీమ్ ప్రకటించింది. తాజా సమాచారం మేరకు సంక్రాంతి బరిలో రానున్న ఓ రెండు పెద్ద సినిమాలు నిర్మాణానంతర పనుల జాప్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని, పండగ స్లాట్ లో అఖండ 2 రిలీజైతే బావుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఎడిటర్ -తమ్మిరాజు, సంగీతం -ఎస్.ఎస్.థమన్. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్- IVY ఎంటర్‌టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసారని తెలుస్తోంది.
