Begin typing your search above and press return to search.

"మా వంతు ప్రయత్నం చేశాం.. కానీ తప్పలేదు!

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' విడుదల ఆగిపోవడంతో అభిమానులు ఎంత డిజప్పాయింట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  M Prashanth   |   6 Dec 2025 9:48 AM IST
మా వంతు ప్రయత్నం చేశాం.. కానీ తప్పలేదు!
X

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' విడుదల ఆగిపోవడంతో అభిమానులు ఎంత డిజప్పాయింట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్ల దగ్గర సెలబ్రేషన్స్ కు రెడీ అయిన ఫ్యాన్స్, చివరి నిమిషంలో వచ్చిన వాయిదా వార్తతో డీలా పడిపోయారు. ఈ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సినిమా విడుదల ఆగిపోవడానికి గల కారణాలను క్లుప్తంగా వివరిస్తూ, అభిమానులకు ఒక ఎమోషనల్ నోట్ ను విడుదల చేసింది.

"అఖండ 2 చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ మీదకు తీసుకురావడానికి మేము మా వంతుగా చేయగలిగినంత ప్రయత్నం చేశాం. మా శక్తివంచన లేకుండా పనిచేశాం. కానీ కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు ఇది అలాంటి సమయమే" అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పరిస్థితులు తమ చేతుల్లో లేకుండా పోయాయని పరోక్షంగా తెలిపారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేమికులకు వారు క్షమాపణలు చెప్పారు. "ఈ సినిమా కోసం మీరు ఎంత ఆసక్తిగా, ఎంత అంచనాలతో ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు మమ్మల్ని క్షమించండి" అని చాలా హుందాగా స్పందించారు. సినిమాపై ఉన్న హైప్ ని, ఫ్యాన్స్ ఎమోషన్ ని తాము అర్థం చేసుకోగలమని తెలిపారు.

ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోలేదు. ముఖ్యంగా 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి నిర్మాతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "ఈ ఛాలెంజింగ్ సమయంలో మాకు అండగా నిలిచినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని పేర్కొన్నారు. హీరో, దర్శకుడు నిర్మాతలకు సపోర్ట్ గా ఉన్నారని దీని ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అయితే సినిమా విజయంపై మాత్రం వారికి నమ్మకం ఉంది. "అఖండ 2 ఎప్పుడు వచ్చినా సరే.. కచ్చితంగా బిగ్ హిట్. బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ మిస్ అవ్వదు" అని ధీమా వ్యక్తం చేశారు. లేట్ అయినా సరే, లేటెస్ట్ గా వచ్చి రికార్డులు కొడతామనే కాన్ఫిడెన్స్ వారి మాటల్లో కనిపించింది.

చివరగా, "కొత్త రిలీజ్ డేట్ తో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాం" అని ప్రామిస్ చేశారు.

ప్రస్తుతం ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాక, సరైన సమయం చూసి డేట్ అనౌన్స్ చేస్తారని అర్థమవుతోంది. ఇక అప్పటివరకు అభిమానులు ఓపిక పట్టక తప్పదు. క్రిస్టమస్ బరిలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అలాగే డిసెంబర్ రెండవ వారం తరువాత కూడా కొన్ని డేట్స్ పై ఫోకస్ పెట్టారు. చూడాలి మరి అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో.