అఖండ-2 వాయిదా.. కెరీర్ లోనే తొలిసారి ఫ్యాన్స్ కు ఇలా..
అయితే అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకుపోవడం వల్ల మూవీ వాయిదా పడినట్లు అర్థమవుతుంది.
By: M Prashanth | 5 Dec 2025 9:45 AM ISTనందమూరి బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ అభిమాన నటుడి లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం కోసం ఎంతో ఎదురు చూడగా.. రిలీజ్ వాయిదా పడడంతో చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని, థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైన వారంతా డీలా పడిపోయారు.
ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్న అఖండ-2 మూవీ.. షెడ్యూల్ ప్రకారం నేడే వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావాల్సి ఉంది. నిన్న అంటే గురువారం రాత్రి ప్రీమియర్స్ పడాల్సి ఉంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మేకర్స్.. చివరి నిమిషంలో సినిమా విడుదలను వాయిదా వేశారు.
ముందు పెయిడ్ ప్రీమియర్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కొత్త డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే అఖండ 2 మూవీ నిజానికి సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5వ తేదీకి అప్పుడు వాయిదా వేశారు.
ఇప్పుడు అనివార్య కారణాలు అంటూ చెబుతూ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. అయితే అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకుపోవడం వల్ల మూవీ వాయిదా పడినట్లు అర్థమవుతుంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ.28 కోట్ల బకాయిలు ఉన్నాయని, అది చెల్లించే వరకు సినిమా నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు, అఖండ రిలీజ్ ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోస్ కు మొత్తం డబ్బులు.. వడ్డీతో సహా చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది.
ఏదేమైనా సడెన్ గా విడుదల వాయిదా పడడం మాత్రం సినీ ప్రియులను, అభిమానులను తీవ్ర కలత చెందేలా చేసింది. ముఖ్యంగా అఘోర గెటప్ వేసుకున్న కొందరు బాలయ్య అభిమానులు.. సినిమా పోస్ట్ పోన్ అవ్వడం పట్ల ఆవేదన చెందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బాలయ్య కెరీర్ లోనే ఫ్యాన్స్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి..మరి అఖండ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
