అఖండ 2: భాగస్వాములు మారితే ఈ పరిస్థితి వచ్చేది కాదా?
నిజానికి `1- నేనొక్కడినే` చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మించిన ఆచంట బ్రదర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో అఖండ 2ని నిర్మించినప్పుడు కంపెనీ మారింది కదా?
By: Sivaji Kontham | 6 Dec 2025 10:33 PM ISTప్రపంచవ్యాప్తంగా ఎన్బీకే అభిమానులు తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. అఖండ 2 రిలీజ్ అనూహ్యంగా ఆర్థిక కారణాలతో ఆగిపోవడం తీవ్ర ఆందోళనలకు కారణమైంది. ఓవైపు ఈ సినిమాని కొనుగోలు చేసిన పంపిణీదారుల, ఎగ్జిబిటర్లు లబోదిబోమనే పరిస్థితి నెలకొందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు బుకింగులు చేసుకున్న ప్రేక్షకులు, అభిమానులకు కూడా ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. దాదాపు 100కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కారణంగా ఎవరెవరికి ఎలాంటి నష్టాలు వస్తాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అయితే అన్ని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంటకు ఉన్న అప్పుల గురించి ఇంత పెద్ద సినిమా చేసేప్పుడు అగ్ర హీరో నందమూరి బాలకృష్ణకు తెలియదా? అంటూ కొందరు నెటిజనులు కామెట్లు చేస్తున్నారు. 1-నేనొక్కడినే సమయంలో ఈరోస్ ఇంటర్నేషనల్ తో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కి ఎదురైన ఆర్థిక వివాదం గురించి తెలియనిదా? దాదాపు 24 కోట్ల మేర అప్పు ఉన్నా.. దానిపై 14 శాతం వడ్డీలు కట్టాల్సి ఉన్నా కానీ, ఈ నిర్మాణ సంస్థను నమ్మి బాలయ్య ఎలా అవకాశం ఇచ్చారు? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసీ బోయపాటి స్పందించలేదేమిటి? అంటూ పలువురు నిలదీస్తున్నారు.
నిజానికి `1- నేనొక్కడినే` చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మించిన ఆచంట బ్రదర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో అఖండ 2ని నిర్మించినప్పుడు కంపెనీ మారింది కదా? ఆ కంపెనీ అప్పు చేస్తే, ఈ కంపెనీని ఎలా అప్పు కట్టమని కోర్టు అడుగుతుంది? అంటూ లాజికల్ పాయింట్ ని కూడా కొందరు రైజ్ చేసారు. అయితే దీనికి ప్రముఖ లాయర్ చెప్పిన జవాబు... మాతృ సంస్థకు సిస్టర్ సంస్థ కాబట్టి, భాగస్వాములు మారలేదు కాబట్టి, ఈరోస్ ఇంటర్నేషనల్ కి చట్టపరంగా దొరికిపోయారు! అని, ఒకవేళ ఆచంట బ్రదర్స్ పూర్తిగా వేరే బ్యానర్ పేరుతో భార్యలను భాగస్వాములుగా చేసి కొత్త సినిమాని ప్రారంభించి ఉంటే కోర్టులో డిపెండ్ చేసుకునేందుకు అవకాశం ఉండేదని కూడా న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ పేరు వేరు.. భాగస్వాములు వేరుగా ఉన్నప్పుడు కోర్టు ఆలోచించేది.
కానీ ఇప్పుడు అదే బ్యానర్ కి కొనసాగింపు బ్యానర్ ని ప్రారంభించినప్పుడు ఈ వ్యక్తులే పాత అప్పులను చెల్లించాల్సి ఉంటుందని లాయర్లు విశ్లేషిస్తున్నారు. ఒక కంపెనీ పేరు మీద అప్పు చేసినప్పుడు ఆ కంపెనీకి చెందిన వ్యక్తులు కొత్త కంపెనీని ప్రారంభించినా కానీ, ఆ కంపెనీతో అలయెన్స్ లో వారి పేర్లు ఉండకూడదని, కొత్త వారితో కంపెనీలను నడిపించాలని కూడా కొందరు లాయర్లు సూచించడం విశేషం. ఇక ఈ కేసులో 1-నేనొక్కడినే నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర పేరు వినిపించకపోవడం చూస్తుంటే, ఆయన తెలివిగా తప్పించుకున్నారని, ఆయన సొంత బ్యానర్ ని స్థాపించి తన దారిని సురక్షిత గమ్యం వైపు నడిపించారని కూడా కొందరు లాయర్లు విశ్లేషిస్తుండడం విశేషం. దశాబ్ధంపైగా కోర్టులో నడుస్తున్న కేసు అకస్మాత్తుగా ఎన్బీకే సినిమాకి అడ్డంకిగా మారుతుందనేది ఎవరూ ఊహించనిది. బ్లాక్ బస్టర్ కొడుతుందని భావించిన అఖండ 2 కి ఈ కష్టాలు ఊహించనివి అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
