Begin typing your search above and press return to search.

అఖండ 2: సస్పెన్స్ వీడింది.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. డిసెంబర్ 11న రాత్రి నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ షోలు ఉంటాయని సమాచారం.

By:  M Prashanth   |   9 Dec 2025 10:52 PM IST
అఖండ 2: సస్పెన్స్ వీడింది.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!
X

ఎన్నో మలుపులు, మరెన్నో వాయిదా వార్తల తర్వాత 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ పై ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది. ఉదయం నుంచి డిసెంబర్ 12న సినిమా వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా కేవలం రూమర్ అనుకున్న వారికి, చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటనతో సమాధానం చెప్పేసింది. బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

గత వారం ఆర్థిక, న్యాయపరమైన చిక్కుల వల్ల సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ సమస్యలన్నింటినీ నిర్మాతలు విజయవంతంగా పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇక బాక్సాఫీస్ దగ్గర బాలయ్య హవా మొదలవ్వబోతోంది.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 12న 'అఖండ 2' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఉదయం నుంచి వినిపిస్తున్న వార్తలే నిజమయ్యాయి. కేవలం వారం రోజుల గ్యాప్ లోనే సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ నిండింది. సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిన పనిలేకుండా, ఇప్పుడే పండగ చేసుకునే అవకాశం దొరికింది.

మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. డిసెంబర్ 11న రాత్రి నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ షోలు ఉంటాయని సమాచారం. అంటే రిలీజ్ డేట్ కంటే ముందే టాక్ బయటకు వచ్చేస్తుంది. అఖండ సృష్టించిన ఇంపాక్ట్ వల్ల ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రీమియర్స్ తోనే ఆ హైప్ ను డబుల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సహజంగానే హై లెవెల్లో ఉంటాయి. ఇందులో బాలయ్యను శివుడికి ప్రతిరూపంగా చూపిస్తూ, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పే కథాంశంతో సినిమాను రూపొందించారు. తమన్ మ్యూజిక్, విజువల్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి.

సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని అఖండ 2 బాక్సాఫీస్ వేటకు సిద్ధమైంది. మరి ఈ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.