అఖండ 2 టికెట్ 2లక్షలు.. అదీ అభిమాని ప్రేమంటే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి బిగ్ బ్రేక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 రాకకు ఇంకో ఐదు రోజులే సమయం ఉంది.
By: Sivaji Kontham | 30 Nov 2025 5:43 PM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి బిగ్ బ్రేక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 రాకకు ఇంకో ఐదు రోజులే సమయం ఉంది. ఈసారి పాన్ ఇండియాలో దుమ్ము రేపడం ఖాయమనే ధీమాతో ఉన్నారు బాలయ్య. హిందీ వోళ్లకు మనమేంటో తెలిసొచ్చింది బాసూ! అంటూ ప్రమోషన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి కాన్ఫిడెన్స్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సౌత్ తో పోలిస్తే పదింతలు అదనపు వసూళ్లకు ఆస్కారం ఉన్నది ఉత్తరాది మార్కెట్లోనే కాబట్టి బాలయ్య బాబు చాలా గట్టి ప్లాన్ తోనే అఖండ 2 ని ఉత్తరాదినా బరిలో దించుతున్నారని అర్థమవుతోంది. హిందూత్వ- సనాతన ధర్మం కాన్సెప్ట్ హిందీ బెల్ట్ లో గట్టిగానే కొడుతుందనే ధీమా బోయపాటిలో కూడా ఉంది.
దానికి తగ్గట్టే ప్లానింగ్ సాగిపోతోందని సమాచారం. అఖండ 2 డిసెంబర్ 5న తెలుగు-హిందీ సహా అన్ని దక్షిణాది భాషలలో అత్యంత భారీగా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించిందని మేకర్స్ ధృవీకరించారు. రన్‌టైమ్ దాదాపు 2 గంటల 25 నిమిషాలు. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అఖండ 2 మాస్ కి స్పెషల్ ట్రీట్ గా నిలుస్తుందని, క్లాస్ ఆడియెన్‌ని కూడా కుర్చీ అంచుకు జారేలా చేస్తుందని కూడా చిత్రబృందం చెబుతోంది. ఇది బాక్సాఫీస్ ఫిగర్స్ పై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపిస్తారు. హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, పూర్ణ పాత్రలు అదనపు ఆకర్షణ కానున్నాయి.
అయితే అఖండ 2ని పెద్ద తెరపై వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డయాస్పోరా ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. బాలయ్య అఖండ తాండవాన్ని కనులారా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనేదే అభిమానుల ఆత్రం. అసలు బాలయ్య అంటే చెవి కోసుకునే అభిమానులు ఎలా ఉంటారో ఈ జర్మనీకి చెందిన ఎన్నారై అభిమానిని చూస్తే అర్థమవుతుంది. అతడు అఖండ 2 కోసం చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు అఖండ 2ని మొదటి రోజే వీక్షించేందుకు టికెట్ ని అక్షరాలా 2 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడట. ఇది నిజంగా సర్ ప్రైజింగ్ టాస్క్. పది రోజులు ఆగితే రూ.300 లోపు ధరతో సినిమా చూడగలం. మొదటి పదిరోజులు థియేటర్లకు వెళ్లని సామాన్యుడిలా ఆలోచిస్తే అతడికి ఏకంగా 2లక్షలు మిగిలేది. కానీ బాలయ్య బాబుపై తన అన్ లిమిటెడ్ ప్రేమను చాటుకుంటూ పోటీపడి మరీ రూ. 2లక్షలకు టికెట్ కొనుక్కున్నాడు. అయితే అందరి అంచనాలకు తగ్గట్టు అఖండ 2 రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ రిచ్ గా నిర్మించారు. నందమూరి థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 2డితో పాటు 3D లో కూడా విడుదల చేయబోతున్నారనేది అభిమానులకు చివరిలో ఊహించని ట్విస్ట్.
