'అఖండ 2' ఆగిపోవడం వెనుక అసలు టెన్షన్.. 100 కోట్లు వెనక్కి ఇచ్చేయండి!
అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోవడం ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది.
By: M Prashanth | 6 Dec 2025 1:17 PM ISTఅఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోవడం ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. కేవలం అభిమానులే కాదు, ఈ సినిమా మీద కోట్లు పెట్టుబడి పెట్టిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రముఖ పంపిణీదారులు, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ చేసిన ఒక బహిరంగ విజ్ఞప్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాసిన లేఖలో సినిమా వాయిదా వల్ల క్షేత్ర స్థాయిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా వివరించారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ, ఈ రోజు సినిమా రిలీజ్ కాకపోవడం ఎవరూ ఊహించని పరిణామం అని అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాను కేవలం తన ఒక్కడి కోసమే కాకుండా, తనతో మాట్లాడి బాధను పంచుకున్న ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్ల తరపున ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి గొంతుకగా మారి ఆయన నిర్మాతల ముందు ఒక డిమాండ్ ఉంచారు.
సినిమా వాయిదా పడటం ఒక ఎత్తు అయితే, తదుపరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఖరారు కాకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ సినిమా కోసం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు చెల్లించిన మొత్తం అడ్వాన్సుల రూపంలో దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని నట్టి కుమార్ వెల్లడించారు. ఈ మొత్తాన్ని వడ్డీలకు తెచ్చి కట్టినవారే ఎక్కువ. రోజులు గడుస్తున్న కొద్దీ వడ్డీల భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలకు ఆయన ఒక సూచన చేశారు. దయచేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెల్లించిన మొత్తాన్ని రేపటిలోగా రీఫండ్ (వెనక్కి ఇవ్వడం) చేయాలని కోరారు. అలా చేస్తే వారికి ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభిస్తుందని, వడ్డీల భారం నుంచి బయటపడతారని తెలిపారు. సినిమా విడుదల తేదీ ఖరారయ్యాక మళ్లీ ఆ డబ్బులు కట్టించుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇలా డబ్బులు వెనక్కి ఇవ్వడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటారనే బలమైన సందేశం వెళ్తుందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఇది ఇండస్ట్రీ ఐక్యతను చాటే సమయం అని గుర్తుచేశారు. నిర్మాతలు స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి అఖండ 2 వాయిదా వ్యవహారం కేవలం కోర్టు కేసులకే పరిమితం కాలేదు. బయట వంద కోట్ల రూపాయల సర్క్యులేషన్ ఆగిపోవడంతో ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. మరి నట్టి కుమార్ విజ్ఞప్తికి నిర్మాతలు ఎలా స్పందిస్తారో, ఆ డబ్బును వెనక్కి ఇస్తారా లేక త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్దిచెబుతారా అనేది చూడాలి.
