Begin typing your search above and press return to search.

అఖండ 2: గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఓవర్సీస్ లో రెడ్ సిగ్నల్?

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమాకు సంబంధించి ఎరోస్ సంస్థతో నడుస్తున్న వివాదం దాదాపు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.

By:  M Prashanth   |   9 Dec 2025 10:10 AM IST
అఖండ 2: గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఓవర్సీస్ లో రెడ్ సిగ్నల్?
X

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమాకు సంబంధించి ఎరోస్ సంస్థతో నడుస్తున్న వివాదం దాదాపు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. నిన్న రాత్రి జరిగిన చర్చల్లో సమస్య పరిష్కారమైందని, ఈరోజు కోర్టులో ఈ విషయం చెప్పి విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో డిసెంబర్ 12న సినిమా విడుదల, 11న ప్రీమియర్స్ వేయడానికి అంతా సిద్ధం చేసుకోవచ్చు అనే ఆలోచన అందరిలో ఉంది.

ఇక లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు ఇది పండగ లాంటి వార్తే అయినా, ఓవర్సీస్ పంపిణీదారులకు మాత్రం ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. ఇండియాలో లాగా విదేశీ మార్కెట్ లో రాత్రికి రాత్రి సినిమాలు విడుదల చేయడం కుదరదు. అక్కడ ఏర్పాట్లు వేరు, మార్కెట్ పరిస్థితులు వేరు. సినిమాకు భారీ బిజినెస్ జరిగింది కాబట్టి, ఆ పెట్టుబడి వెనక్కి రావాలంటే కనీసం వారం రోజుల ముందు నుంచే టికెట్ బుకింగ్స్, ప్రచార హడావిడి ఉండాలి.

కానీ ఇప్పుడు సడన్ గా కేవలం రెండు రోజుల్లో సినిమా అంటే టికెట్లు తెగడం కష్టమని, ఇది పెద్ద రిస్క్ అని అక్కడి బయ్యర్లు భయపడుతున్నారు. డిసెంబర్ 12 అనేది మన తెలుగు రాష్ట్రాల పంపిణీదారులకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఓవర్సీస్ లో థియేటర్ల సర్దుబాటు, కంటెంట్ డెలివరీ సమయానికి అందడం పెద్ద సవాలు. ముందస్తు హడావిడి లేకుండా ప్రీమియర్స్ వేస్తే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావని వారు ఆందోళన చెందుతున్నారు.

ఒకవేళ ఓవర్సీస్ వాళ్లు ససేమిరా అంటే, నిర్మాతలు డిసెంబర్ 25 విడుదల తేదీని ప్రత్యామ్నాయంగా ఆలోచించాల్సి వస్తుంది. కానీ డిసెంబర్ 25 వైపు వెళ్తే అక్కడ మరో పెద్ద గండం ఉంది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్ 3' విడుదలవుతోంది. ఒకవేళ ఆ సినిమా గనక క్లిక్ అయితే, దాని ధాటికి థియేటర్లు దొరకడం కష్టం, పైగా ప్రేక్షకుల దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది.

అయితే 'అఖండ 2' కు హిట్ టాక్ వస్తే మాత్రం, క్రిస్మస్ సెలవులు కాబట్టి డిసెంబర్ 25 కూడా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. ఎరోస్ తో లీగల్ సమస్య తీరినా, ఓవర్సీస్ పంపిణీదారులను ఒప్పించడం అనేది నిర్మాతలకు మరో పెద్ద సవాలుగా మారింది. వారు రిస్క్ తీసుకుని 12న విడుదలకు ఒప్పుకుంటారా లేక సేఫ్ గేమ్ కోసం అవతార్ 3 పోటీని తట్టుకుని 25న వస్తారా? అనేది చూడాలి. మొత్తానికి బాలయ్య సినిమాకు అడ్డంకులు తొలగినా, అసలు టెన్షన్ మాత్రం ఇంకా పోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.