Begin typing your search above and press return to search.

బాలయ్య బయటికి.. రంగంలోకి రామ్

ఐతే ‘అఖండ-2’ వాయిదాతో.. పనైపోయింది అనుకున్న సినిమాకు మళ్లీ ఊపిరి వచ్చినట్లయింది. ఆ చిత్రమే.. ఆంధ్ర కింగ్ తాలూకా.

By:  Garuda Media   |   6 Dec 2025 10:30 PM IST
బాలయ్య బయటికి.. రంగంలోకి రామ్
X

అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. ఈ పాటికి ‘అఖండ’ ఫీవర్‌తో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతుండాలి. వరల్డ్ వైడ్ ‘అఖండ-2’ రిలీజైన ప్రతి చోటా థియేటర్లు జనాలతో కళకళలాడుతుండాలి. నందమూరి అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తుండాలి. కానీ అనూహ్య పరిణామాల మధ్య ‘అఖండ-2’ రిలీజ్‌కు బ్రేక్ పడడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

శనివారం అయినా సినిమా రిలీజవుతుందేమో అని ఆశించినా.. అలాంటిదేమీ జరగలేదు. చాలా విషయాలను సర్దుబాటు చేసుకుని కానీ రిలీజ్ డేట్ ఖరారు చేయలేని పరిస్థితుల్లో ‘అఖండ-2’ టీం తర్జనభర్జన పడుతోంది. రిలీజ్ ముంగిట ‘అఖండ-2’ను చాలా బాగా ప్రమోట్ చేసిన బాలయ్య.. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కొట్టే అవకాశం రావడంతో రిలీజ్ తర్వాత కూడా సినిమాను బాలయ్య ప్రమోట్ చేయాలని అనుకున్నాడు కానీ.. ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఆయన మౌనం వహిస్తున్నాడు.

ఐతే ‘అఖండ-2’ వాయిదాతో.. పనైపోయింది అనుకున్న సినిమాకు మళ్లీ ఊపిరి వచ్చినట్లయింది. ఆ చిత్రమే.. ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమా మరింత డౌన్ అయింది. ‘అఖండ-2’ మీదికి ఫోకస్ షిఫ్ట్ అవడంతో ఆ చిత్రాన్ని పట్టించుకోలేదు జనాలు. కానీ ఆ చిత్రం వాయిదా పడడంతో వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టుకునే అవకాశం ఈ చిత్రానికి వచ్చింది. ‘అఖండ-2’ కోసం ఈ సినిమా స్క్రీన్లను బాగా తగ్గించాల్సింది. కానీ బాలయ్య సినిమా లేకపోవడంతో ఉన్న స్క్రీన్లను కొనసాగిస్తూ కొన్ని అదనపు షోలు కూడా ఇచ్చారు. సినిమాను వీకెండ్లో పుష్ చేసేందుకు రామ్ థియేటర్ల విజిట్ కూడా చేస్తున్నాడు.

ఈ రోజు హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌కు రామ్‌తో పాటు భాగ్యశ్రీ కూడా రానున్నారు. రేపు కూడా థియేటర్ల విజిట్స్ ఉన్నాయి. వీకెండ్ తర్వాత కూడా సినిమాను వీలైనంత మేర ప్రమోట్ చేయాలని చూస్తోంది టీం. మరి ఈ ఎక్స్‌టెండెడ్ రన్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఏమేర వసూళ్లు పెంచుకుంటుందో చూడాలి.