అఖండ మేకర్స్.. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పై కన్నేశారా?
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం.
By: M Prashanth | 23 Nov 2025 7:20 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ అఖండ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.
బాలయ్య.. అఖండ సీక్వెల్ తో తాండవం చేయనున్నారని.. ఆడియన్స్ విపరీతంగా అలరించనున్నారని అంతా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ను విట్నెస్ చేసిన తర్వాత ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుని ఫిదా చేసింది.
అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం మేకర్స్.. ముందు రోజు ప్రీమియర్స్ వేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్తలు రాగా.. ఆ విషయంపై ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
అంటే విడుదలకు ముందు రోజే.. అఖండ సీక్వెల్ మోత మోగనుందని చెప్పాలి. అదే సమయంలో బాలయ్య.. డిసెంబర్ 4వ తేదీ నుంచే తాండవం చేయనున్నారన్న మాట. ఆడియన్స్ అంచనాలను అందుకుని.. ప్రీమియర్స్ నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక తిరుగులేదు. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్ల వర్షం కురవడం పక్కా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అప్పుడు ఓపెనింగ్స్ కూడా స్ట్రాంగ్ గా వస్తాయి.
ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కంటెంట్ ఉంటే.. ప్రీమియర్స్ మేకర్స్ కు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి. అలా ప్రీమియర్ ద్వారా సాలిడ్ ఓపెనింగ్స్ పై మేకర్స్ కన్నేసినట్లు కనిపిస్తుంది. అయితే ప్రీమియర్స్ కు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో జీవోను మేకర్స్ అందుకోనున్నారని సమాచారం. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈజీగా జీవో రానుందని టాక్. ఎందుకంటే నైజాంలో దిల్ రాజు.. మూవీని విడుదల చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ సీక్వెల్ ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
