Begin typing your search above and press return to search.

తప్పుగా అర్థం చేసుకున్నారు.. రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ!

అఖండ 2 కొత్త డేట్ ప్రకటించక ముందే డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. దీంతో కొంతమంది దీనిని తప్పుగా వక్రీకరిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   10 Dec 2025 12:48 PM IST
తప్పుగా అర్థం చేసుకున్నారు.. రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ!
X

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న నాలుగవచిత్రం అఖండ 2. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 12 కి వాయిదా వేస్తూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 12న విడుదల కాబోతుండడంతో చాలా సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే హీరో నందు నటిస్తున్న సైక్ సిద్ధార్థ్ మూవీని డిసెంబర్ 12న విడుదల చేయాల్సి ఉండగా.. అఖండ 2 వస్తున్న నేపథ్యంలో జనవరి 1కి వాయిదా వేశారు.

మరోవైపు సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. అఖండ 2 కొత్త డేట్ ప్రకటించక ముందే డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. దీంతో కొంతమంది దీనిని తప్పుగా వక్రీకరిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ కి రిప్లై ఇస్తూ సానుభూతి కోసం ఆ కామెంట్స్ చేయలేదు అంటూ.. మరో సుదీర్ఘ పోస్ట్ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు డైరెక్టర్ సందీప్ రాజ్.

"డిసెంబర్ 12న నేను దర్శకత్వం వహించిన మోగ్లీ సినిమా విడుదల చేయాలనుకున్నాము. దీనికంటే ముందే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్ కి వాయిదా వేయాలని మొదట భావించాము. అయితే ఈ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆ ఎమోషన్ తోనే నేను పోస్ట్ పెట్టాను. క్రిస్మస్, సంక్రాంతికి భారీ విడుదలలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 13నే మొగ్లీ 2025 సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాము. మీ అందరి మద్దతు మాకు కావాలి. అఖండ 2 పై కూడా నాకు అపారమైన గౌరవం ఉంది. నేను విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. మీరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి నా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను" అంటూ సందీప్ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం సందీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా చాలామంది సందీప్ కు మద్దతుగా నిలుస్తున్నారు. సందీప్ ఇంతలా బాధపడుతూ మళ్లీ పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. డిసెంబర్ 12న మోగ్లీ 2025 విడుదలకు ప్లాన్ చేశారు. అయితే ఆరోజు అఖండ 2 విడుదల కాబోతుండడంతో ఈ సినిమాను డిసెంబర్ 13కు వాయిదా వేశారు. ఈ తేదీని నిర్ణయించడానికి ముందు సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.." నాదే బ్యాడ్ లక్ అనుకుంటున్నా.. డైరెక్టెడ్ బై బై సందీప్ రాజ్ అని వెండితెరపై నా పేరును చూసుకోవాలన్న కల రోజురోజుకు కష్టంగా మారుతోంది . సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు .దీనిపైన కొంతమంది నెగటివ్ కామెంట్లు చేయడంతో ఇప్పుడు సానుభూతి కోసం ఈ పోస్ట్ పెట్టడం లేదు అని ఆయన ఒక పోస్ట్ పంచుకున్నారు.