Begin typing your search above and press return to search.

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

ఆకాష్ మాట్లాడుతూ.. తనకు దాదాపు 13 ఏళ్ల వయసులో రాహుల్ విజయ్ పరిచయమయ్యాడని చెప్పారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   3 Nov 2026 10:17 AM IST
అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!
X

చిన్న వయసులో ప్రతి ఒక్కరికీ తమపై ఎంతో నమ్మకం ఉంటుంది. తాము అనుకున్నది సాధిస్తామని..అందరినీ వెనక్కి నెట్టేస్తామని భావిస్తుంటారు. కానీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు మన ఆలోచనలను మారుస్తాయి. ఇప్పుడు తన చిన్ననాటి కాన్ఫిడెన్స్ గురించి హీరో ఆకాష్ పూరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడిగా ఆకాష్ పూరిపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ పోకిరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించడంతో..ఆయన కుమారుడు హీరోగా వస్తే పెద్ద స్టార్ అవుతాడని చాలామంది భావించారు. అయితే ఆకాష్ ఇప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇటీవల రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన అ (AH) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు రాహుల్ విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆకాష్ మాట్లాడుతూ.. తనకు దాదాపు 13 ఏళ్ల వయసులో రాహుల్ విజయ్ పరిచయమయ్యాడని చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారని తెలిపారు. చిన్నప్పటి నుంచే రాహుల్ టాలెంట్‌ను దగ్గరగా చూశానని అన్నారు.

ఒకసారి బ్యాంకాక్‌లో తన తండ్రి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటనను ఆకాష్ గుర్తు చేసుకున్నారు. అక్కడ ఒక పార్టీలో అందరూ తనను డ్యాన్స్ చేయమని అడిగారని, తాను కూడా డ్యాన్స్ చేశానని చెప్పారు.

ఆ సమయంలో తనకు హీరోగా పరిచయం అయితే అందరూ తమ బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనని అనిపించేదని సరదాగా తెలిపారు. అయితే ఆ తర్వాత రాహుల్ విజయ్ డ్యాన్స్ చూసి తన ఆలోచన మారిపోయిందని చెప్పారు.

తనకంటే ఎంతో ప్రతిభ ఉన్నవాళ్లు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని రాహుల్ తనకు అర్థమయ్యేలా చేశాడని ఆకాష్ అన్నారు. అదే కాన్ఫిడెన్స్‌తో ఉంటే తానే వెళ్లిపోవాల్సి వస్తుందని చిన్నప్పుడే తెలుసుకున్నానని చెప్పారు.

అప్పటి నుంచి రాహుల్‌ను కేవలం స్నేహితుడిగా కాకుండా అన్నయ్యలా భావిస్తున్నానని తెలిపారు. ‘అ (AH)’ ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించిన ఆకాష్, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ నటించిన ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.