స్టార్ హీరో మూవీ అటకెక్కడానికి కారణం ఇదే
తాజా సమాచారం మేరకు తళా అజిత్ కుమార్ తన పారితోషికాన్ని రెట్టింపు పెంచేసాడని చెబుతున్నారు.
By: Sivaji Kontham | 14 Nov 2025 9:00 PM ISTఓవైపు స్టార్ హీరోల పారితోషికాల భారం నిర్మాతపై పడకుండా తమిళ ఫిలింఛాంబర్ కొత్త రూల్స్ ని ప్రతిపాదించింది. ఇకపై హీరోలు సినిమా లాభనష్టాలలో షేర్ అందుకోవాలనేది కొత్త రూల్. హీరోలు ఇక ఎప్పటికీ పారితోషికాలు అందుకోరు..అనవసరంగా డిమాండ్ చేయకూడదు! అని కూడా రూల్ పెట్టారు. అలా కట్టుబడి ఉండని హీరోలకు నిర్మాతలు, పంపిణీదారులు సహకరించకూడదని కూడా తీర్మానం చేసారు. కానీ ఈ రూల్ ని తమిళ హీరోలు అస్సలు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.
తాజా సమాచారం మేరకు తళా అజిత్ కుమార్ తన పారితోషికాన్ని రెట్టింపు పెంచేసాడని చెబుతున్నారు. అతడు నటించిన విదాయుముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలకు 105-110 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకున్నాడని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కొన్ని తమిళ మీడియాలు `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రానికి 150కోట్లు డిమాండ్ చేసాడని కూడా వార్తలు వెలువడ్డాయి.
కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.. తళా అజిత్ అంతకుమించి డిమాండ్ చేస్తున్నాడని కథనాలొస్తున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేం ఆధిక్ రవిచంద్రన్ వినిపించిన స్క్రిప్టును ఓకే చేసిన అజిత్ 150కోట్లు పైగా నిర్మాతలను డిమాండ్ చేసాడు. అయితే నిర్మాతలకు 150 కోట్లు చెల్లించేందుకు అభ్యంతరం లేదు. కానీ అది సరిపోదని అతడు భీష్మించుకుని కూచున్నాడట. దీంతో ప్రాజెక్ట్ లాభనష్టాలను భేరీజు వేసుకున్న నిర్మాతలు ప్లాన్ మార్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలో పట్టు విడుపు లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ సెట్స్ కెళ్లలేదు! అంటూ ప్రచారం సాగుతోంది.
2025 ఏప్రిల్ లో విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం అజిత్ కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించిందని కథనాలొచ్చాయి. సినిమా రొటీన్ గా ఉన్నా కానీ, తమిళ ప్రజలు ఆదరించడంతో వసూళ్లలో బెస్ట్ అనిపించింది. కానీ క్రిటికల్ గా తీవ్ర విమర్శలపాలైంది. ఇప్పుడు మరోసారి ఆధిక్ రవిచంద్రన్ తో ముందుకు వెళ్లాలని భావించినా కానీ, అజిత్ మొండి పట్టుదల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కథనాలొస్తున్నాయి. అజిత్ హవా తమిళంలో ఎంత ఉన్నా, ఇరుగు పొరుగు భాషల్లో అది వర్కవుట్ కావడం లేదు. అందువల్ల కూడా నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. కేవలం అజిత్ కి 150 కోట్లు పైగా ముట్టజెప్పినా, ఓవరాల్ గా 320 కోట్లు దాటిపోతుందని, ఇది రికవరీ చేయలేని బడ్జెట్ అని నిర్మాతలు నమ్ముతున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లేనట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, అజిత్, విజయ్, కమల్ హాసన్ అత్యంత భారీ పారితోషికాలు అందుకునేవారి జాబితాలో ఉన్నారు. వీరంతా నిర్మాత లాభనష్టాలలో వాటా తీసుకునేందుకు డీల్ కుదుర్చుకోవాలని కండిషన్ పెట్టినా వీళ్లెవరూ వినేట్టు లేరని తాజా పరిణామం చెబుతోంది.
