అజిత్ కార్ క్రాష్.. రేసింగ్ లో ఊహించని పరిణామం.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
అజిత్ రేసింగ్ ట్రాక్‌పై ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు.
By: Madhu Reddy | 24 Aug 2026 11:53 AM ISTతమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా వెలుగుగొందుతున్న అజిత్ కుమార్ మరోసారి కార్ రేసింగ్ ప్రమాదానికి గురయ్యారు. యూరప్‌లో జరిగిన ఒక అత్యంత వేగవంతమైన రేసింగ్ ఈవెంట్‌లో ఆయన నడుపుతున్న కారు అదుపు తప్పి మరొక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు క్రాష్ అయినప్పటికీ, అజిత్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఊపిరి పీల్చుకున్నాయి.
అనుకోకుండా అదుపుతప్పిన రేసింగ్ కార్:
అజిత్ కుమార్ తన సొంత టీమ్ 'అజిత్ రెడ్ యాంట్ బై విరేజ్' తరఫున ప్రతిష్టాత్మక 'లే మన్స్ కప్' రేసింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక యూరప్‌లోని హై-స్పీడ్ ఎండ్యూరెన్స్ రేస్‌లో తీవ్ర పోటీ నడుస్తుండగా, ఊహించని విధంగా ఆయన కార్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న కారును ఢీకొట్టింది. కారు దెబ్బతిన్నప్పటికీ అజిత్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం బయటకు రావడంతో ప్రమాదం తీవ్రతపై ఆందోళన తగ్గుముఖం పట్టింది.
గతంలోనూ తప్పిన భయంకర ప్రమాదాలు:
అజిత్ రేసింగ్ ట్రాక్‌పై ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఇటలీలో జరిగిన జిటి4 యూరోపియన్ సిరీస్, వాలెన్సియాలో జరిగిన పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేసుల్లో కూడా ఆయన ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇక ప్రతిసారీ ఆయన ధైర్యంతో, అదృష్టవశాత్తూ ఎలాంటి పెద్ద గాయాలు లేకుండా క్షేమంగా బయటపడుతుండటం విశేషం.
ప్రమాదాల తర్వాత అజిత్ మైండ్‌సెట్:
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదాలు జరిగినప్పుడు తన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అజిత్ గతంలో పలుమార్లు పంచుకున్నారు. ప్రమాదం జరగగానే మొదట తనకు ఏమైనా గాయాలయ్యాయా అని చెక్ చేసుకుంటానని, ఆ తర్వాత కారు మళ్లీ రేసులో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉందో లేదో మాత్రమే చూస్తానని ఆయన చెప్పేవారు. ఇక రేసింగ్ పట్ల ఆయనకున్న ఇష్టానికి ఇది నిదర్శనం.
సినిమాలు, రేసింగ్ సమతుల్యం:
ఇక అటు రంగుల ప్రపంచంలో వరుస సినిమాలు చేస్తూనే, ఇటు అంతర్జాతీయ స్థాయిలో కార్ రేసర్‌గా అజిత్ రాణిస్తున్నారు. ఇటీవలే 'విడాముయర్చి', 'గుడ్ బాడ్ అగ్లీ' చిత్రాలతో అలరించిన ఆయన, ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'డేర్‌డెవిల్' సినిమాలో నటిస్తున్నారు.
సినిమా షూటింగ్‌లు ఎంత బిజీగా ఉన్నా తన డ్రీమ్ అయిన కార్ రేసింగ్‌ను అజిత్ వీడకపోవడం ఆయన ఫ్యాషన్‌కు అద్దం పడుతోంది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన అజిత్ కుమార్, త్వరలోనే మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో ట్రాక్‌పైన, అలాగే వెండితెరపైనా రచ్చ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
