Begin typing your search above and press return to search.

శంక‌ర్ గేమ్ ఛేంజ్ చేసే హీరో దొరికేసాడు!?

తమిళ చిత్ర పరిశ్రమలో ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి సీనియ‌ర్ల‌ను వ‌దిలేస్తే, ఆ త‌ర్వాత లీగ్‌లో ఉన్న హీరోల‌లో ద‌ళ‌ప‌తి విజయ్ పూర్తిగా రాజ‌కీయాల‌కు అంకిత‌మ‌వ్వ‌డంతో ఆ త‌ర్వాత హ‌వా సాగించే స‌త్తా ఉన్న ఏకైక‌ ప్రముఖ హీరో అజిత్ కుమార్ మాత్ర‌మే.

By:  Sivaji Kontham   |   11 Aug 2026 4:00 AM IST
శంక‌ర్ గేమ్ ఛేంజ్ చేసే హీరో దొరికేసాడు!?
X

తమిళ చిత్ర పరిశ్రమలో ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి సీనియ‌ర్ల‌ను వ‌దిలేస్తే, ఆ త‌ర్వాత లీగ్‌లో ఉన్న హీరోల‌లో ద‌ళ‌ప‌తి విజయ్ పూర్తిగా రాజ‌కీయాల‌కు అంకిత‌మ‌వ్వ‌డంతో ఆ త‌ర్వాత హ‌వా సాగించే స‌త్తా ఉన్న ఏకైక‌ ప్రముఖ హీరో అజిత్ కుమార్ మాత్ర‌మే. త‌ళాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ప్ర‌స్తుతం అజిత్ తన కొత్త చిత్రం `డేర్ డెవిల్`ను అధికారికంగా ప్రకటించి వార్తల్లో నిలిచారు. `గుడ్ బ్యాడ్ అగ్లీ` వంటి విజయవంతమైన సినిమా తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ కాంబినేషన్లో వస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా ప్రకటనతో అభిమానులు ఆనందంలో ఉండగానే..సోషల్ మీడియాలో అజిత్‌కు సంబంధించిన మరో ఊహించని వార్త విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో అజిత్ త్వరలోనే ఒక భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన `డేర్ డెవిల్` షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ కాంబినేషన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో సినీ ప్రియులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.

అయితే దర్శకుడు శంకర్ ప్రస్తుతం తన సినీ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేక ప్లాప్‌లుగా మిగిలాయి. బ్యాక్-టు-బ్యాక్ డిజాస్టర్లతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న శంకర్ చివ‌రిగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ కు గేమ్ ఛేంజ‌ర్ లాంటి ఫ్లాప్‌ని ఇచ్చారు. అందుకే ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఒక బలమైన స్టార్ హీరో కాంబినేషన్ కోసం శంక‌ర్ ఎదురుచూస్తున్నారు.

మరోవైపు శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `వేల్‌పారి`ని అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కించాలని చాలా కాలంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. భారీ నిర్మాణ వ్యయం కారణంగా ఆ ప్రాజెక్ట్ తక్షణమే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అజిత్‌తో చేయబోయే సినిమా వేల్‌పారి అవుతుందా లేక మరొక కొత్త కథతో వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

వరుస ప్లాప్‌లతో ఫామ్‌లో లేని శంకర్‌కు అవకాశం ఇచ్చి అజిత్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నారా? అనే చర్చలు కూడా నెట్టింట మొదలయ్యాయి. కెరీర్ డౌన్ ఫేజ్‌లో ఉన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచడం అజిత్ ధైర్యానికి నిదర్శనమని ఆయన అభిమానులు అంటుంటే... ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందోనని విశ్లేషకులు వేచి చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగి చూడాల్సిందే.