Begin typing your search above and press return to search.

విజయ్ తో గొడవలపై అజిత్ రియాక్షన్!

సాధారణంగా హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా వారి అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో నానా రభస చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   7 Nov 2025 10:24 AM IST
విజయ్ తో గొడవలపై అజిత్ రియాక్షన్!
X

సాధారణంగా హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా వారి అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో నానా రభస చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. తాము అన్నదమ్ములలా.. స్నేహితులులా కలిసి ఉన్నామని ఎంత చెప్పినా అభిమానుల చెవులకు ఎక్కకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి. ఒక హీరోని దూషిస్తూ.. మరొక హీరో అభిమాని చేసే కామెంట్లు సోషల్ మీడియాలో కోల్డ్ వార్ కి దారితీస్తుంటే.. అటు హీరోల అభిమానుల మధ్య గొడవలు మాత్రం బహిరంగ ప్రదేశాలలో కూడా జరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.

ఇదిలా ఉండగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయా జనరేషన్లకు సంబంధించిన హీరోల మధ్య గొడవలు ఉన్నాయి అని అభిమానులు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమలహాసన్ - రజనీకాంత్ మధ్య పడడం లేదు అని.. ఒకరంటే ఒకరికి నచ్చదు అని వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి.. ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఆ తర్వాత స్టార్ హీరోలైన అజిత్ - విజయ్ దళపతి మధ్య గొడవలు ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేశారు.

ఇదే విషయంపై అటు అభిమానుల మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మొన్నామధ్య విజయ్ దళపతితో గొడవలపై అజిత్ మేనేజర్ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసినా రూమర్స్ ఆగలేదు. దీంతో రంగంలోకి అజిత్ దిగి.. అసలు సమస్యలు సృష్టించే వారి వల్లే ఇలాంటి గొడవలు అంటూ స్పందించారు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే..అజిత్ మాట్లాడుతూ.. "కొంతమంది మా ఇద్దరి మధ్య లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. వాటిని చూసి మా అభిమానులు కూడా ఒకరితో ఒకరు గొడవ పెట్టుకుంటున్నారు. అలా సమస్యలు సృష్టించే వారంతా కూడా మౌనంగా ఉంటే అందరికీ బాగుంటుంది. విజయ్ మంచి కోరుకునే వారిలో నేను కూడా ఒకడిని. ఎప్పటికీ కూడా ఆయనకు మంచి జరగాలని కోరుతూనే ఉంటాను. దయచేసి మా మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారాలు అవాస్తవం. నమ్మకండి. ఇలాంటి ప్రచారాలు అసలే చేయకండి" అంటూ అజిత్ విజయ్ దళపతితో గొడవలు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా మరొకవైపు వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో మేనేజర్ కూడా స్పందిస్తూ.. వారిద్దరూ మంచి స్నేహితులు. అజిత్ కి పద్మభూషణ్ వచ్చినప్పుడు మొదట శుభాకాంక్షలు చెప్పింది విజయ్ దళపతి మాత్రమే అని గుర్తు చేశారు. అటు మేనేజర్ తో పాటు ఇటు ఏకంగా హీరో కూడా స్పందించారు. మరి ఇప్పటికైనా ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోతాయేమో చూడాలి.