Begin typing your search above and press return to search.

అవినీతికి వ్య‌తిరేకంగా ఎంత మంది హీరోలు ముందుకొస్తారు?

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ వెండితెరపైనే కాదు. సామాజిక విషయాల్లోనూ త‌న గళాన్ని వినిపిస్తుంటారు.

By:  Srikanth Kontham   |   7 May 2026 5:00 AM IST
అవినీతికి వ్య‌తిరేకంగా ఎంత మంది హీరోలు ముందుకొస్తారు?
X

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ వెండితెరపైనే కాదు. సామాజిక విషయాల్లోనూ త‌న గళాన్ని వినిపిస్తుంటారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ చేపట్టిన ప్రత్యేక అవగాహన ప్రచారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతోన్న ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. ఆర్థిక నేరాలు అనేవి కేవలం వ్యక్తులకు సంబంధించినవి కావని అవి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అజయ్ దేవగన్ అభిప్రాయపడ్డారు.

మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ చర్యల వల్ల సామాన్యులు పరోక్షంగా నష్టపోతున్నార‌ని పేర్కొన్నారు. ఈడీ వంటి సంస్థలు ఇలాంటి నేరాలను అరికట్టడానికి చేస్తోన్న‌ ప్రయత్నాలను ప్రశంసించారు. పౌరులుగా మనం కూడా మన బాధ్యతను గుర్తించాలని హితవు పలికారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇది అని అజయ్ వ్యాఖ్యానించారు. అక్రమ సంపాదన ద్వారా లభించే సంపద దేశ భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు.

యువత ఇలాంటి మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలని ఆకాంక్షించారు. చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. అప్పుడే స్వచ్ఛమైన , పారదర్శకమైన వ్యవస్థ సాధ్యమవుతుందన్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి సంకో చిస్తుంటారు. కానీ అజయ్ దేవగన్ ఎప్పుడూ దేశ హితం కోరే విషయాల్లో ముందుంటారు. ఈడీ ప్రచారానికి ఆయన బ్రాండ్ ఇమేజ్ తోడవడంతో సామాన్య ప్రజల్లో ఈ అంశంపై మరింత అవగాహన పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తన సినిమాల్లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించిన అజయ్ నిజ జీవితంలోనూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతోన్న నేపథ్యంలో సైబర్, ఆర్థిక నేరగాళ్లు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఇలాంటి తరుణంలో అజయ్ వంటి ప్రముఖులు అవగాహన కల్పించడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రచారంలో భాగంగా ఆర్థిక అక్రమాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు. ఒక సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. అజయ్ దేవగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్ల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. స్టార్ హోదాలో ఉండి సమాజానికి మేలు చేసే పనులకు మద్దతు ఇవ్వడం అభినందనీయమని కొనియాడుతున్నారు. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ యుద్ధంలో హీరోలంతా బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చేసిన విన్నపం ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తుందో చూడాలి. అజయ్ చూపిన ఈ చొరవ ఇతర సెలబ్రిటీలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశీంచొచ్చు.