Begin typing your search above and press return to search.

2025 బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్.. బెడిసి కొట్టిన‌ సీక్వెల్ ప్లాన్

ఇటీవ‌లి కాలంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కించానే అత్యుత్సాహం ఫిలింమేక‌ర్స్ లో క‌నిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   19 Sept 2025 9:30 AM IST
2025 బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్.. బెడిసి కొట్టిన‌ సీక్వెల్ ప్లాన్
X

ఇటీవ‌లి కాలంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కించానే అత్యుత్సాహం ఫిలింమేక‌ర్స్ లో క‌నిపిస్తోంది. కానీ అన్నిసార్లు ప‌ప్పులు ఉడ‌క‌వు అని నిరూప‌ణ అవుతోంది. బాహుబ‌లి సీక్వెల్, కేజీఎఫ్ సీక్వెల్, పుష్ప సీక్వెల్ ఇవ‌న్నీ సంచ‌ల‌నాల విజ‌యాల్ని సాధించ‌డంతో, ఇత‌ర హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో ఉన్న క్రేజ్ ను ఎన్ క్యాష్ చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు.

కానీ చాలా సార్లు ఇలాంటి ప్ర‌య‌త్నాలు `బూమ‌రాంగ్` గా మారుతున్నాయి. కొన్నిటికి టైమింగ్ చాలా ముఖ్యం. కొన్నేళ్ల క్రితం వ‌చ్చిన సినిమాకి సీక్వెల్ సినిమా తీస్తే, నాటి క్రేజ్ ఇప్పుడు ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా మొద‌టి భాగంలో క‌థ‌, కంటెంట్ ని క‌నెక్ట్ చేసిన‌ట్టు, ఇప్పుడు సీక్వెల్ సినిమాలో క‌నెక్ట్ చేయ‌లేక‌పోతే అది బూమ‌రాంగ్ గా మారుతుంది. అలాంటి ఒక ఫెయిల్యూర్ ఎపిసోడ్ బాలీవుడ్ అగ్ర హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

అత‌డు న‌టించిన `స‌న్ ఆఫ్ స‌ర్ధార్` సీక్వెల్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. ఈ సినిమాని దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ నిర్మించ‌గా, కేవ‌లం 60కోట్లు మాత్ర‌మే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూలు చేసింది. బ‌య్య‌ర్లు స‌గానికి స‌గం న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. పైగా అజ‌య్ దేవ‌గ‌న్ లాంటి పెద్ద హీరో న‌టించిన సినిమాకి 30కోట్ల లోపు తొలి వీకెండ్ (3 రోజుల్లో) వ‌సూళ్లు ద‌క్క‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మొద‌టి నాలుగు రోజులు కేవ‌లం 30 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. నాలుగో రోజు నుంచి పూర్తిగా చ‌తికిల‌బ‌డింది.

ఈ సినిమా వీక్ స్టోరి, ద‌ర్శ‌కత్వ‌ వైఫ‌ల్యం కార‌ణంగా ప్ర‌జ‌ల్లో మౌత్ టాక్ బ్యాడ్ గా వ‌చ్చింది. దీంతో నాలుగో రోజు నుంచే థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయ‌ని ట్రేడ్ నిరాశ‌ను వ్య‌క్తం చేసింది. ఇక క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ తో పాటు రవి కిషన్, రోష్ని వాలియా, మృణాల్ ఠాకూర్, సంజయ్ మిశ్రా, విందు దారా సింగ్, దీపక్ డోబ్రియాల్, కుబ్రా సైత్, చుంకీ పాండే, పంజాబీ నటి నీరు బజ్వా, దివంగత ముకుల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. భారీ తారాగ‌ణం న‌టించినా కానీ ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచ‌లేక‌పోయింది.

ఈ ఏడాది ప‌రిమిత బ‌డ్జెట్ లో రూపొందించిన ప‌లు చిత్రాలు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సాధించాయి. కానీ పెద్ద బ‌డ్జెట్ తో రూపొందించిన స‌న్నాఫ్ స‌ర్ధార్-2 లాంటి సినిమాలు డిజాస్ట‌ర్ అవ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా న‌టించిన మిరాయ్ కేవ‌లం మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఇత‌ర హీరోల‌కు హెచ్చ‌రిక‌గా గుర్తుంచుకోవాలి. కంటెంట్ ఉంటే లాజిక్కులు వెత‌క్కుండా, ప్ర‌జ‌లు సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. అజ‌య్ దేవ‌గ‌న్ స‌హా ప‌లువురు సీనియ‌ర్ స్టార్లు త‌మ ప‌రాజ‌యాల వెన‌క కార‌ణాల‌ను వెతికే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.