దశ తిరగాలంటే.. ఏకైక దిక్కు!
పరిశ్రమలో స్టార్‌డమ్ ని మించి సక్సెస్ ముఖ్యం. స్థిరంగా బ్లాక్ బస్టర్లు సాధిస్తూ, బయ్యర్లు, పంపిణీదారులకు లాభాలు అందించేవాడే నిజమైన హీరోగా వెలుగొందుతాడు.
By: Sivaji Kontham | 22 Aug 2025 9:40 AM ISTపరిశ్రమలో స్టార్‌డమ్ ని మించి సక్సెస్ ముఖ్యం. స్థిరంగా బ్లాక్ బస్టర్లు సాధిస్తూ, బయ్యర్లు, పంపిణీదారులకు లాభాలు అందించేవాడే నిజమైన హీరోగా వెలుగొందుతాడు. కరోనా క్రైసిస్ కంటే చాలా ముందు నుంచి బాలీవుడ్ అగ్ర హీరోల పరిస్థితి అయోమయంగా ఉంది. ఖాన్‌లు, కపూర్ లు, కుమార్ లు కూడా హిట్లు ఇవ్వలేక చతికిలబడ్డారు. షారూఖ్ పఠాన్, జవాన్ చిత్రాలతో, రణబీర్ యానిమల్ చిత్రంతో కంబ్యాక్ అవ్వకపోయి ఉంటే పరిస్థితి మరొకలా ఉండేది.
ఇక ఇతర హీరోల్లో అజయ్ దేవగన్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అతడు నటించిన ఇటీవలి చిత్రం `సన్ ఆఫ్ సర్ధార్ 2` కూడా యావరేజ్‌గా ఆడింది. వరుసగా బాలీవుడ్ దర్శకులతో పని చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందుకే ఇప్పుడు దేవగన్ దృష్టి ఒక సౌత్ దర్శకుడిపై ఉందని తెలుస్తోంది. షారూఖ్, సైఫ్, సల్మాన్, అక్షయ్, రణబీర్, సన్నీడియోల్, బాబి డియోల్ వంటి స్టార్లు పూర్తిగా దక్షిణాది ప్రతిభను నమ్మి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో దేవగన్ కూడా ఒక సౌత్ దర్శకుడినే నమ్ముతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో సహాయక పాత్ర తరవాత అతడు పూర్తిగా ఓ సౌత్ సినిమాలో నటించాలని తపించడం ఆసక్తిని కలిగిస్తోంది.
దీనికోసం అజయ్ దేవగన్ `సు ఫ్రం సో` ఫేం, కన్నడ దర్శకుడు జేపీ తుమినాడుతో కలిసి పని చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కన్నడలో హారర్ కామెడీ 'సు ఫ్రం సో' బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించింది. అలాగే తెలుగులోను అనువాదమై విడుదలైన ఈ చిత్రం రిజల్ట్ ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా జేపీ టేకింగ్ అందరికీ నచ్చింది. అతడు ప్రతిభావంతుడైన దర్శకుడు అని పరిశ్రమ అర్థం చేసుకుంది. ఇప్పుడు అజయ్ దేవగన్ లాంటి పెద్ద హీరో తనకు తానుగానే అతడితో పని చేసేందుకు ఆసక్తిని కనబరచడం ఉత్సాహం పెంచుతోంది. ఇప్పటికే దర్శకహీరోలు కథా చర్చలు ప్రారంభించారని కూడా తెలుస్తోంది.
జేపీ సింగిల్ లైన్ కథను వినిపించాడు. ఐడియా దేవగన్ కి నచ్చింది. తదుపరి బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేయాల్సి ఉందని తెలిసింది. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే దేవగన్ తో సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. 2026 ప్రథమార్థంలో ఈ మూవీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కెవిఎన్ సంస్థ అక్షయ్, సైఫ్ తో సినిమాలను నిర్మిస్తోంది. భవిష్యత్ లో హిందీ, కన్నడ చిత్ర రంగంలో మరిన్ని క్రేజీ చిత్రాలను నిర్మించేందుకు ప్రణాళికలను కలిగి ఉంది.
