ఓ రీమేక్‌తో కెరీర్ టాప్ హిట్!
రీమేక్ సినిమాలతో కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్న అజయ్ దేవగణ్‌కు ఇప్పుడు అదే దారిలో మరో భారీ హిట్ దక్కింది.
By: M Prashanth | 14 Oct 2026 12:00 PM ISTరీమేక్ సినిమాలతో కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్న అజయ్ దేవగణ్‌కు ఇప్పుడు అదే దారిలో మరో భారీ హిట్ దక్కింది. మలయాళ 'దృశ్యం' ఆధారంగా మొదలైన హిందీ ఫ్రాంచైజీ, మూడో భాగంతో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది. సింగం లాంటి మాస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌కు, విజయ్ సల్గావ్కర్ పాత్ర కెరీర్ బెస్ట్ వసూళ్లు అందించడం విశేషం.
అజయ్ సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ అనగానే 'సింగం ఎగైన్' గుర్తుకొస్తుంది. ఆ సినిమా తొలి రోజు రూ.43.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, 'దృశ్యం: ది కన్‌క్లూజన్' రూ.62 కోట్లతో మొదలైందని సమాచారం. ఇదే అజయ్ కెరీర్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు. పోలీస్‌గా నేరస్థులను పట్టుకునే పాత్ర కంటే, పోలీసులకు చిక్కకుండా కుటుంబాన్ని కాపాడే పాత్రతో ఎక్కువ ఓపెనింగ్ రావడం మరో విశేషం. పైగా మూడో భాగం కావడంతో విడుదలకు ముందే బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అజయ్ దేవగణ్ కెరీర్లో రీమేక్‌ల ఫలితాలు చూస్తే ఒక విచిత్రమైన తేడా కనిపిస్తుంది. తమిళ 'ఖైదీ'ని భారీ యాక్షన్‌తో 'భోలా'గా తీస్తే ఆశించిన విజయం దక్కలేదు. కానీ మలయాళ 'దృశ్యం'తో మొదలైన ఫ్రాంచైజీ మాత్రం కెరీర్ బెస్ట్ వసూళ్ల వరకు తీసుకెళ్లింది. 'భోలా'లో హీరోయిజం కోసం భారీ హంగులు జోడించినా ఫలితం దక్కలేదు.
అయితే దృశ్యం మూడో భాగంలో హిందీ టీమ్ ఒక మార్పు చేసింది. మలయాళ వెర్షన్ కథను అలాగే తీసుకోకుండా, విజయ్ సల్గావ్కర్కు వేరే ముగింపు రాశారు. దీంతో ఒరిజినల్ చూసినవాళ్లకు కూడా హిందీ సినిమాలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మిగిలింది. మోహన్‌లాల్ సైతం హిందీ క్లైమాక్స్‌ను మెచ్చుకున్నట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ వెల్లడించారు. కథ తెలిసిన ప్రేక్షకులు ఉన్నప్పటికీ, ఈసారి వాళ్లకు కూడా కొత్త క్లైమాక్స్ చూపించారు.
ఇప్పటికే రూ.500 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ అనే ప్రచారం ఉండగా, ఫుల్ రన్లో రూ.650 నుంచి 670 కోట్ల వరకు వెళ్లొచ్చని అంచనాలు వస్తున్నాయి. ఇండియా నెట్ వసూళ్లు రూ.400-415 కోట్ల మధ్య ఉండొచ్చని మరో అంచనా. అజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'దృశ్యం' నిలుస్తుందనే అంచనాలకు ప్రస్తుత కలెక్షన్లు బలం ఇస్తున్నాయి. మరోవైపు ఇంత బిజినెస్ చేసినా హిందీలో నాలుగో భాగం ఉండదని అభిషేక్ పాఠక్ చెప్పారు. అందుకే మూడో సినిమాకు 'ది కన్‌క్లూజన్' అనే పేరు పెట్టారు. మలయాళంలో మాత్రం కథను కొనసాగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
