Begin typing your search above and press return to search.

14 వ‌య‌సులో మ‌త్తుకు బానిసైన హీరో

అయితే అజయ్ దేవగన్ చాలా చిన్న‌వ‌య‌సులో తన మద్యపాన వ్య‌స‌నం త‌న‌ను ఎలా మ‌త్తులోకి దించిందో తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

By:  Sivaji Kontham   |   7 Nov 2025 10:41 AM IST
14 వ‌య‌సులో మ‌త్తుకు బానిసైన హీరో
X

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి పాత్ర‌తో తెలుగు వారి అభిమానం చూర‌గొన్నాడు అజ‌య్ దేవ‌గ‌న్. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌తో పాటు దేవ‌గ‌న్ పోషించిన పాత్ర సినిమాకి ప్ల‌స్ అయింది. బాలీవుడ్ లో యాక్ష‌న్ హీరో ఇమేజ్ ని ఆస్వాధిస్తున్న దేవ‌గ‌న్, కెరీర్ లో ఎన్నో ఉత్థాన‌ప‌త‌నాలు చ‌వి చూసాడు. కానీ చివ‌ర‌కు అగ్ర హీరోల‌లో ఒక‌రిగా స్థిర‌ప‌డ్డాడు. ప్ర‌ముఖ న‌టి కాజోల్ ని దేవ‌గ‌న్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే అజయ్ దేవగన్ చాలా చిన్న‌వ‌య‌సులో తన మద్యపాన వ్య‌స‌నం త‌న‌ను ఎలా మ‌త్తులోకి దించిందో తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు

అత‌డు చెప్పిన ఈ జీవిత స‌త్యం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజయ్ ఒకప్పుడు తాను విపరీతంగా తాగేవాడినని, కేవలం 14 సంవత్సరాల వయసులోనే మ‌త్తుకు అల‌వాటు ప‌డ్డాన‌ని వెల్లడించాడు. చాలా చిన్న వయసులోనే తాగడం ప్రారంభించిన విష‌యాన్ని నిజాయితీగా అంగీక‌రించాడు. స్నేహితుల ప్రోద్బలంతో మొదటిసారి మద్యం ప్రయత్నించినప్పుడు ఏమీ తెలీని వ‌య‌సు. 14 వ‌య‌సులో త‌న‌కు ఏమీ తెలీదు. అది ఒక‌సారికి మాత్రమే అనుకున్నాడ‌ట‌. కానీ అది క్రమంగా అలవాటుగా మారింది.

మ‌ద్యం నెమ్మ‌దిగా ఎలా అలవాటుగా మారిందో అజయ్ దేవగన్ మాట్లాడారు. మొదట్లో ట్రై చేస్తున్నాను అనుకున్నాడు కానీ అది ఒక దినచర్యగా మారింది. చాలాసార్లు మానేయడానికి ప్రయత్నించాచినా అది అంత సులువు కాద‌ని తెలుసుకున్నాడు. ఆ ఏజ్ లో వ్య‌స‌నానికి అల‌వాటుప‌డ‌టం చాలా సులువు.. కానీ మానేయడం కష్టం.. చాలా తాగిన త‌ర్వాత ఇక ఆపడం అవసరమని భావించిన‌ట్టు దేవ‌గ‌న్ చెప్పాడు. తనను తాను నియంత్రించుకోవడానికి, అజయ్ ఒక వెల్నెస్ స్పాలో చేరాడు. అక్కడ కౌన్సిలింగ్ కార‌ణంగా నెమ్మ‌దిగా మద్యం పూర్తిగా మానేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చివేసింది. ఇప్పుడు ఆల్క‌హాల్ ను ఒక వ్యసనంలా కాకుండా రిలాక్సేష‌న్ కోసం రెండు పెగ్గులు అని భావిస్తున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం అల‌వాటుగా కాకుండా, 30ఎంఎల్‌ మాల్ట్ ని దిన‌చ‌ర్య‌గా తీసుకుంటున్నాన‌ని చెప్పాడు. కొన్నిసార్లు రెండు పెగ్గులు.. అంతే! అని చెప్పాడు. ఈ మార్పు త‌న‌కు చాలా ప్ర‌శాంత‌త‌నిచ్చింద‌ని అన్నాడు. అజయ్ దేవగన్ ఇప్పుడు ప్రీమియం లిమిటెడ్ ఎడిషన్ మాల్ట్‌లను మాత్రమే తాగుతాడు. దీని ధర ఒక బాటిల్‌కు దాదాపు రూ. 60,000. అతడు ఒకప్పుడు వోడ్కాను ఇష్టపడేవాడు.. కానీ ఇప్పుడు మాల్ట్‌తో స‌రిపెట్టుకుంటున్నాన‌ని చెప్పాడు.

ఒక వ్యక్తి తాగిన తర్వాత సంతోషంగా ఉండలేకపోతే వారు అస్సలు తాగకూడదని అజ‌య్ అన్నారు. తాగే ఎవరైనా సంతోషంగా ఉండాలి.. లేదంటే మానేయడం మంచిది. చాలా మంది తాగిన తర్వాత కోపంతో ఊగిపోతారు లేదా చాలా బోరింగ్‌గా మారతారని అలాంటి వారిని తాను అస్సలు సహించలేనని అజయ్ చెప్పాడు. దేవ‌గ‌న్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీ. దేదే ప్యార్ దే2 స‌హా రేంజ‌ర్, ధ‌మాల్ 4 లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.