'దురంధర్' స్థాయిలో మరో స్పైవర్స్ ఆదిత్యాధర్ లేకుండా పాజిబులేనే?
అజయ్ దేవగన్, భూషణ్ కుమార్ కలిసి భారీ స్పై థ్రిల్లర్‌ను రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అజయ్ ఆసక్తి చూపితే 2027లో షూటింగ్ ప్రారంభించి, 2028 మధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
By: Sivaji Kontham | 23 Nov 2026 7:59 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడు-నిర్మాత కాంబినేషన్లలో మరో `దురంధర్` తరహా స్పైయూనివర్శ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే కథనాలొస్తున్నాయి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అజయ్ దేవగన్-భూషణ్ కుమార్ భారీ స్పై థ్రిల్లర్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో `తానాజీ: ది అన్‌సంగ్ వారియర్`, `రైడ్ 2`, `దృశ్యం 2`, `ధమాల్ 4`, `దే దే ప్యార్ దే` వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సక్సెస్‌ఫుల్ జోడీ ఇటీవల స్పై థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతోంది.
బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. భారతీయ గూఢచార (స్పై) ప్రపంచంలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథాంశంతో భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథపై అజయ్ దేవగన్‌తో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరగ్గా.. ఈ స్పై యూనివర్స్‌లోకి అడుగుపెట్టేందుకు అజయ్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కథాంశం `ధురంధర్` స్థాయిలో అత్యంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఇక్కడే సినీ విశ్లేషకులు, అభిమానులలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన `ధురంధర్` స్థాయిలో మరో స్పైవర్స్‌ను మరొకరు తెరకెక్కించడం సాధ్యమవుతుందా? ఆదిత్య ధర్ తరహా గ్రిప్పింగ్ నేరేషన్.. వాస్తవికతతో కూడిన ఆ మ్యాజిక్‌ను వేరొక దర్శకుడు మళ్లీ రిపీట్ చేయగలడా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. టీ-సిరీస్ -భూషణ్ కుమార్ ఇప్పటివరకు అజయ్ దేవగన్‌తో ప్రారంభించబోతున్న ఈ స్పై యూనివర్స్‌కు దర్శకుడు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం ఈ ఉత్కంఠను మరింత పెంచుతోంది.
ఈ భారీ స్పై థ్రిల్లర్‌కు సంబంధించిన దర్శకుడి పేరు.. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రస్తుతానికి మేకర్స్ రివీల్ చేయలేదు. అజయ్ దేవగన్ అధికారికంగా ఓకే చెప్పగానే 2027లో షూటింగ్ ప్రారంభించి 2028 మధ్యలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ కెరీర్‌లోనే అత్యంత భారీ అంచనాలున్న చిత్రంగా ఇది నిలవనుందని సమాచారం.
కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తున్న అజయ్ దేవగన్.. భూషణ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ కొత్త స్పై థ్రిల్లర్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆదిత్య ధర్ `ధురంధర్` రేంజ్ అంచనాలను అందుకోవాలంటే ఆ స్థాయి విజన్ ఉన్న దర్శకుడినే టీ-సిరీస్ రంగంలోకి దించాల్సి ఉంటుంది. మరి ఈ స్పై యూనివర్స్ బాధ్యతలను ఏ దర్శకుడు చేపడతారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
