బాలీవుడ్ హీరో ఫస్ట్ ఏఐ మూవీ వచ్చేస్తోంది!
2020లో ఓం రౌత్ డైరెక్షన్‌లో అజయ్ దేవగన్ చేసిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా `తానాజీ:ది అన్ సంగ్ వారియర్`.
By: Tupaki Entertainment Desk | 20 Jan 2026 6:00 AM ISTఏఐ ఎంట్రీతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా నిర్మాణరంగంలో కూడా ఏఐ వాడకం మొదలైంది. అయితే చాలా వరకు పాక్షికంగా ఉన్న ఏఐ వాడకం ఇప్పుడు పూర్తి స్థాయిలో వినయోగంలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత మంది స్టార్‌లు ప్రత్యేకంగా స్టూడియోస్ నిర్మిస్తూ సినిమాల నిర్మాణానికి రెడీ అవుతున్నారు. కొంత మంది ట్రైయల్స్ స్టేజ్‌లో ఉంటే మరి కొంత మంది పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో రియల్ మూవీ ఫీల్‌ని కలిగించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ విషయంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ ముందడు వేశాడు. తన మేనల్లుడు దేవ్‌గన్‌తో కలిసి లెన్స్ వాల్ట్ స్టూడియోస్‌ని ప్రారంభించిన అజయ్ దీనిపై ఓ ఏఐ మూవీని నిర్మిస్తున్నాడు. 2020లో ఓం రౌత్ డైరెక్షన్‌లో అజయ్ దేవగన్ చేసిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా `తానాజీ:ది అన్ సంగ్ వారియర్`. మరాఠా యోధుడి కథగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందించి బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ప్రస్తుతం దీనికి ప్రీక్వెల్‌గా తానాజీ యంగ్ ఏజ్ స్టోరీగా `బాల్ తానాజీ` పేరుతో ఓ ఏఐ మూవీకి అజయ్ దేవగన్ శ్రీకారం చుట్టాడు.
లెన్స్ వాల్ట్ స్టూడియోస్ తొలి ఏఐ ఆధారిక ప్రాజెక్ట్ కావడం, ఈ టెక్నాలజీని అజయ్ దేవగన్ లాంటి ప్రముఖ హీరో ఉపయోగిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఏఐ ఆధారిత సినిమాలకు ఈ మూవీ నాంది పలకనున్న నేపథ్యంలో `బాల్ తానాజీ` ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ వీడియోని హీరో అజయ్ దేవగన్ తాజాగా విడుదల చేశారు. అజయ్ దేవగన్ వాయిస్‌తో టీజర్ విజువల్స్‌ని స్టార్ట్ చేస్తూ ఈ కథ ఎప్పుడు ఎక్కడ మొదలైందో స్పష్టం చేశారు.
కథకు సంబంధించిన వరల్డ్ ని రీక్రియేట్ చేయడంలో ప్రిస్‌మిక్స్ స్టూడియోస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ `లెన్స్ వాల్ట్ స్టూడియోస్ కథ చెప్పే సంప్రదాయ సరిహద్దుల్ని చెరిపేస్తూ సరికొత్త పంథాని ఆవిష్కరించబోతోంది. దాని కోసమే ఈ స్టూడియోని ఏర్పాటు చేశాం. ప్రధాన స్రవంతి సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇంత వరకు ఎవరూ ఉపయోగించని టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త మార్గాలని అన్వేషించాలన్నదే మా ప్రధాన లక్ష్యం`అని తెలిపారు అజయ్.
ఇది సక్సెస్ అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఏఐ ఆధారిత సినిమాలకు బీజం పడటం ఖాయం. ఇదిలా ఉంటే అజయ్‌దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ `దృశ్యం 3`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మలయాళ ఒరిజినల్‌కు సంబంధం లేకుండా అజయ్ ఈ థర్డ్ ఇనిస్టాల్‌మెంట్‌ని చేస్తుండటంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ఈ మూవీని అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
